కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. వరసగా నమోదువుతున్న కేసులు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. కొన్నాళ్లుగా పెరుగుతున్న కేసులు ఫోర్త్ వేవ్ కు దారి తీస్తాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఫిబ్రవరి చివరి నుంచి జూన్ వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేలకు దిగువనే ఉండేది. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య 15 వేలు దాటుతోంది.
తాజాగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,092 కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారి బారిన పడి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు రోజుతో పోలిస్తే (17,070) స్వల్పంగా కేసుల సంఖ్య తగ్గింది. మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568గా ఉంది. గడిచిన రోజులో 14,684 మంది కోలుకున్నారు. అయితే పాజిటివిటీ రేటు 4.14కు పెరగడం కాస్త ఆందోళన పరుస్తోంది.
Read Also: Monkeypox: యూరప్ లో కల్లోలం.. రెండు వారాల్లోనే మూడింతలైన కేసులు
దేశంలో ఇప్పటి వరకు 4,34,86,326 కరోనా కేసులు నమోదు అయితే.. ఇందులో 4 ,28,51,590 మంది కోలుకోగా.. 5,25,168 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రికవరీ కేసుల శాతం 98.54గా ఉంది. డెత్ రేట్ 1.21 శాతంగా ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు 197,84,80,015 డోసుల టీకాను అర్హులైన ప్రజలకు అందించింది. శుక్రవారం 9,09,776 మందికి వ్యాక్సినేషన్ చేశారు.