ఇండియాలో కరోనా కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరిగింది. నెల క్రితం వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేల లోపే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. నెమ్మదిగా కేసుల సంఖ్య, యాక్టివ్ కేస్ లోడ్ పెరుగుతోంది. ఫోర్త్ వేవ్ ముంచుకొస్తుందా..? అని ప్రజలు భయపడుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,506 కరోనా కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 30 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 99,602గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.35గా నమోదు అయింది. 11,574 మంది వ్యాధి నుంచి రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇండియాలో 525077 మంది వ్యాధి బారిన పడి మరణించగా.. 4,28,08,666 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.56గా ఉంది. డెత్ రేటు 1.21గా ఉంది.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో అర్హులైన వారికి 197 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చారు. నిన్న ఒక్క రోజే దేశంలోని 13,44,788 మందికి వ్యాక్సిన్ అందించారు.