చైనా వూహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రభావం చూపించింది. దేశాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఇప్పటికీ ఏదో రూపంలో కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతూనే ఉంది. తన రూపాలను మార్చుకుంటూ… ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఓమిక్రాన్ ఎక్స్ఈ ఇలా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇండియాలో మాత్రం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటం శుభపరిణామం. కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2288 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మూడు వేలకు కిందే నమోదు అవతున్నాయి. మరణాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ కేవలం 10 మంది మాత్రమే మరణించారు. 3044 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 19,637గా ఉంది. పాజిటివిటీ రేటు ఒకటి కన్నా తక్కువగా 0.47గా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వల్ల 5,24,103 మంది మరణించారు. కరోనా నుంచి 4,25,63,949 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా అర్హులైన వారికి ఇప్పటి వరకు 190,50,86,706 డోసుల వ్యాక్సిన్ అందించారు.
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతుండటంతో ప్రజల్లో ఇమ్యూనిటీ పెరుగుతోంది. దీని కారణంగా సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ తరువాత మరణాల సంఖ్య చాలా వరకు తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా 12-14 ఏళ్ల మధ్య ఉన్న 3 కోట్ల మంది మొదటి డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. దేశంలో 2021, జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వగా… 2021 ఎప్రిల్ 1 నుంచి 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించారు. 2021 మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి, 2022 జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి, 2022 మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.