ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కని విని ఎరుగని ఘోర పరాజయం చవిచూసింది. అధికారంలో ఉన్న పంజాబ్‌ను కోల్పోవటం హస్తం పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈ ఘోర ఓటమి పార్టీలో తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. కొంత కాలంగా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు ఇది నైతిక బలం ఇస్తుందనటంలో సందేహం లేదు.
తాజా ఎన్నికల పరాభవానికి కారణాలు, పరిస్థితులపై పార్టీ అత్యున్నత నిర్ణయాక కమిటీ సీడబ్ల్యూసీ సుదీర్ఘంగా సమావేశమైంది. ఐదు గంటల పాటు వాడి వేడి చర్చ జరిగింది. అసంతృప్త నేతలు జీ-23లోని కొందరు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీని పునర్ వ్యవస్థీకరించాలని చాలా కాలంగా వీరు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ నాయకత్వ బాధ్యతలను గాంధీలకు భారమైతే వేరొకరికి అప్పగించాలనేది వీరి వాదన. కానీ గాంధీలు ఆ పని చేస్తారని ఎవరూ అనుకోరు. మరి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకుండా పార్టీ ఎలా బలోపేతమవుతుంది?
మరోవైపు, గాంధీల కుటుంబ రాజకీయాలపై ప్రధాని మోడీ తరచూ విరుచుకుపడటం చూస్తాం. దీనికి కాంగ్రెస్ దగ్గర కౌంటర్ ఉందా? కాంగ్రెస్ పార్టీ బలం, బలహీనత గాంధీలే. గాంధీలు పక్కకు తప్పకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలవుతుంది. ఈ విషయం సాధారణ కార్యకర్తకు కూడా తెలుసు. కనుకనే పార్టీలో ఇప్పటికీ గాంధీ విధేయులదే మెజార్టీ. కాని పరిస్థితులకు తగ్గట్టు ఎత్తుగడలు వేయాలి. బలమైన ప్రాంతీయ నేతలను సృష్టించాలి. అలాంటి వారిని గుర్తించి ఎదగనివ్వాలి. కానీ కాంగ్రెస్ ఆ పని చేయదు. ఎందుకంటే, ఏది చేసినా గాంధీ కుటుంబమే చేయాలి మరి.
2019 ఎన్నికల ఓటిమికి నైతిక బాధ్యతగా రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. మూడేళ్లుగా పూర్తి స్థాయి అధ్యక్షుడు లేరు. ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చూస్తున్నారు. ఇలా ఎంత కాలం అని అధిష్టానంపై వత్తిడి తేవటంతో ఈ సెప్టెంబర్‌లో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. దానికి మరో ఆరు నెలల సమయం ఉంది. ఈ లోగా పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందనేదే క్యాడర్ భయం.
మరోవైపు, తాజా వైఫల్యాల నేపథ్యంలోపార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ సీడబ్ల్యూసీ మీటింగ్‌లో చెప్పారు. వారికి అంతకు మించి మరో అవకాశం లేదు. కానీ ఆ ప్రతిపాదనను కమిటీ ఏకగ్రీవంగా తిరస్కరించింది. పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సోనియా ప్రకటించారు. అసమ్మతి నేతల అభిప్రాయాలను సోనియా తెలుసుకున్నారు. సంస్థాగత ఎన్నికల వరకు సోనియా నాయకత్వం కొనసాగించాలని సభ్యులంతా కోరారు. ఆగస్టు 20 కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని పార్టీ ప్రకటించింది.
2014 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో ఇలాంటి మేదో మథనాలు ఎన్నో జరిగాయి. కానీ అంతిమ ఫలితం ఏమిటనేది ముఖ్యం. ఎందుకంటే ఎన్నికలలో ఓడిన ప్రతిసారీ ఇదే తంతు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఈ ఈ ఉదాసీనత సామాన్య కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికే ఇతర పార్టీలలోకి వలసపోతున్నారు. పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
గత ఎనిదేళ్లలో కాంగ్రెస్ పార్టీ పది రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. ఒక్కో రాష్ట్రం చేజారిపోతున్నా… పార్టీ మనుగడకే ముప్పు ఏర్పడుతున్నా ఎందుకు అధిష్టానంలో చలనం లేదు? బీజేపీకి ధీటుగా ప్రణాళికలు రచించి ఎందుకు అమలు చేయలేకపోతోంది? బీజేపీకి తామే ఏకైక జాతీయ ప్రత్యామ్నాయం అనే అతి నమ్మకం కారణం కావచ్చు. కానీ పంజాబ్ ఓటమితో ఆ నమ్మకమూ పటాపంచలైంది. ఈ దెబ్బతో బీజేపీని ఓడించటం కాంగ్రెస్ చేతకాదనే భావన ప్రజలలోకి బలంగా వెళ్లింది. రాబోవు రోజులలో ఇది మరింత బలపడి హిందీ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ స్థానానికి ఆప్ ఎసరు పెట్టేలా చేస్తుంది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దాని మనుగడ పైనే అనుమానాలు కలిగిస్తున్నాయి. బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ ప్రాధాన్యతను ఈ ఓటమి ప్రశ్నార్థకం చేసింది. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి తక్షణం చర్యలకు దిగకపోతే 2024లో మరో పెద్ద పరాజయాన్ని ఆహ్వానించక తప్పదు. అదే జరిగితే భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్న కాంగ్రెస్ ముక్త్ భారత్‌కు ఎన్నో రోజులు పట్టదు.