PM Modi: మరోసారి ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా కూడా రాదని అన్నారు. ఒడిశాలో తొలిసారి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి కాంగ్రెస్ కనీసం 50 సీట్లు కూడా గెలవదని చెప్పారు. కంధమాల్‌లోని ఫుబావిలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: CM Jagan: వంగా గీత, భరత్కు బంపర్ ఆఫర్.. వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవులు
గత 10 ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. 500 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత అయోధ్యలో తమ ప్రభుత్వం రామమందిరాన్ని నిర్మించిందని చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పోఖ్రాన్ పరీక్షలను నిర్వహించి భారతదేశ ప్రతిష్టను పెంచారని, 26 ఏళ్ల క్రితం బీజేపీ సాధించిన విజయాలను ఆయన ప్రస్తావించారు. ఒడిశాకు చెందిన వారు మాత్రమే తదుపరి ముఖ్యమంత్రి అవుతారని హామీ ఇచ్చారు. ఒడిశా భాష, సంస్కృతిని అర్థం చేసుకునే ఈ నెల బిడ్డలే బీజేపీ ప్రభుత్వానికి సీఎం అవుతారని అన్నారు.
ఒడిశాలోని 21 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలకు జరగబోతున్నాయి. లోక్‌సభతో ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగుతున్నాయి. 2019 ఎన్నికల్లో బిజూ జనతాదళ్(బీజేడీ) 21 ఎంపీ స్థానాల్లో 12 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 8 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించింది.