PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. కర్ణాటక బెళగావిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గెలిచేందుకు నిషేధిత ‘పీఎఫ్ఐ’ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. మన హిందూ రాజులను అవమానించిందని, ఔరంగజేబు వంటి ముస్లిం రాజుల దురాగతాలపై ఏనాడు నోరు మెదపలేదని ఆదివారం విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్‌కి చెందిన షెహజాదా( రాహుల్ గాంధీ ) చేసిన ప్రకటన తమ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి అని ఆరోపించారు. నవాబులు, నిజాంలు, సుల్తానులు, బాద్షాలు చేసిన దురాగతాలను, మన వేల దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబు దౌర్జన్యాలు కాంగ్రెస్‌కి గుర్తుండవని, మా తీర్థ క్షేత్రాలను దోచుకున్నారు, ప్రజల్ని చంపారు, ఆవుల్ని వధించారని ప్రధాని అన్నారు. ఇటీవల వైరల్ అయిన రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రస్తావించారు. ‘‘ రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాజులు మరియు మహారాజుల పాలనలో వారు ఏమి చేయగలిగారు, ఎవరి భూమిని కూడా లాక్కోవచ్చు, కాంగ్రెస్, దేశ ప్రజలతో కలిసి స్వాతంత్ర్యం సాధించి ప్రజాస్వామ్యాన్ని తీసుకువచ్చింది’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది.
Read Also: RSS: ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు.. స్పష్టం చేసిన మోహన్ భగవత్..
ఇటీవల హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హిరేమత్ హత్య విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. నేహ లాంటి కూతుళ్ల ప్రాణాలకు విలువ లేదని, కేవలం తమ ఓటు బ్యాంకు గురించి మాత్రమే కాంగ్రెస్ ఆలోచిస్తోందని మండిపడ్డారు. ఇటీవల హుబ్బళ్లిలో నేహా హిరేమత్‌ని ఫయాజ్ అనే నిందితుడు కాలేజ్ క్యాంపస్‌లో పొడిచి చంపాడు. కాంగ్రెస్ ఓట్ల కోసం పీఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)ను ఉపయోగించుకుంటోందని, ఉగ్రవాదనికి ఆశ్రయం ఇచ్చే దేశవ్యతిరేక సంస్థని తమ ప్రభుత్వం నిషేధించిందని, అలాంటి ఉగ్రవాదుల్ని రక్షించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, వయనాడ్‌లో ఒక్క సీటు గెలుచుకోవడం కోసమే పీఎఫ్ఐ సంస్థతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుందని ఆరోపించారు.