Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం తర్వాత చట్టంగా మారడమే మిగిలింది. ఈ బిల్లు ముస్లింలకు మేలు చేకూరస్తుందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే చెబుతుండగా, ఇది ముస్లింల హక్కుల్ని కాలరాస్తుందని కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రతిపాదిత చట్టం ముస్లింల పట్ల వివక్షతను చూపిస్తుందని వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ జావేద్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుదీర్ఘ చర్చ తర్వాత గురువారం అర్ధరాత్రి రాజ్యసభ వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు రాజ్యాంగంలోని ని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), 25 (మతాన్ని ఆచరించే స్వేచ్ఛ), 26 (మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ), 29 (మైనారిటీ హక్కులు), 300A (ఆస్తి హక్కు) లను ఉల్లంఘిస్తుందని ఆయన వాదించారు.
Read Also: Tamil Nadu: తమిళనాడు బీజేపీ కొత్త చీఫ్‌గా తమిళిసై..?
ప్రతిపాదిత చట్టం ఇతర మతపరమైన నిధుల నిర్వహణలో లేని ఆంక్షలు విధించడం ద్వారా మస్లింలపై వివక్ష చూపుతోందని కాంగ్రెస్ ఎంపీ తరుపున న్యాయవాది అనాస్ తన్విర్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. హిందూ, సిక్కు మత ట్రస్టులు కొంతవరకు స్వీయ నియంత్రణలో ఉన్నప్పటికీ, వక్ఫ్ చట్టానికి చేసిన సవరణలు ప్రభుత్వ జోక్యాన్ని అసమానంగా పెంచుతున్నాయని పిటిషన్ పేర్కొంది. ఇది ఆర్టికల్ 14 ఉల్లంఘనకు దారి తీసిందని పిటిషన్‌లో చెప్పారు. ఇది ఇస్లామిక్ చట్టాలను, ఆచారాలను ఆచరించే ఆర్టికల్ 25 వంటి ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడం తప్పనిసరిగా చేయడం వంటివి మతపరమైన పాలనలో జోక్యం చేసుకోవడమే అని పిటిషన్ ఆరోపించింది.