అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది. వరుస పరాజయాల నేపథ్యంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీని తిరిగి పట్టాలెక్కించడం సాధ్యమా? గులామ్ నబీ ఆజాద్ నివాసంలో కొంతమంది కాంగ్రెస్ అసమ్మతి నేతల సమావేశం హాట్ టాపిక్ అవుతోంది. గులాం నబీ అజాద్ నివాసంలో సమావేశానికి హాజరుకానున్నారు
మనీష్ తివారి, భూపేందర్ సింగ్ హుడా, పృధ్విరాజ్ చౌహాన్, ఆనంద శర్మ వంటి నేతలు.
జి-23 అసమ్మతి బృందంలో కాంగ్రెస్ పార్టీని వీడిన జితిన్ ప్రసాద్, యోగానంద శాస్త్రి కూడా హాజరవుతారు. ఇటీవల బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద్ రావడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి) లో చేరిన యోగానంద శాస్త్రి అసమ్మతి సమావేశానికి ఎందుకు వస్తున్నారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సమావేశానికి హాజరుకానున్న మిగిలిన 21 మంది అసమ్మతి కాంగ్రెస్ నేతల్లో అందుబాటులో ఉన్న నేతలు వస్తారని భావిస్తున్నారు. కాంగ్రెస్ లో తారస్థాయికి చేరుతున్న విభేదాల నేపథ్యంలో ఈ సమావేశానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. కపిల్ సిబల్ నివాసంలో డిన్నర్ మీట్ అవుతున్నారు జి23 నేతలు. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, జాతీయ నాయకత్వ మార్పు అంశాలపై చర్చ. జి23 నేతల మీటింగ్ పై ఇప్పటికే కౌంటర్లు మొదలయ్యాయి.
ఇదిలా వుంటే కాంగ్రెస్‌లో రెండు వర్గాల నేతల మధ్య మాటల వేడి పెరుగుతూనే వుంది. గాంధీ కుటుంబానికి విధేయంగా ఉండే నేతలు… జీ23 వర్గంపై విమర్శలు ఎక్కుపెడుతూనే వున్నారు. గాంధీ కుటుంబం పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని కపిల్ సిబల్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయనపై ఎదురుదాడికి దిగారు మరో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్. కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ ఎంతో ప్రయోజనం పొందారని, అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఇలా ఫిర్యాదులు చేయడం దురదృష్టకరమన్నారు.
రాహుల్ గాంధీ పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ఉండాలని పార్టీలోని నేతలంతా భావిస్తున్నారు. ఆగస్టులో ఎన్నికలు జరిగి.. పార్టీ అధ్యక్షుడిగా ఆయన గెలుపొందాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు. రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే సైతం జీ23 నేతలను విమర్శలు చేయడం విశేషం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అన్ని అంశాలపై చర్చించినప్పటికీ.. జీ23 నేతలు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని ఇది తప్పుడు సంకేతాలిస్తుందన్నారు. కాంగ్రెస్ పరాజయం తర్వాత గతంలోనే కాంగ్రెస్‌లో ఎన్నికలు కావాలని, మార్పులు రావాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గతంలో లేఖ రాసిన సంగతి తెలిసిందే. జీ 23 నేతలు ఏ అంశాలు చర్చిస్తారోనని అంతా ఆసక్తి కనబరుస్తున్నారు.