దశాబ్దాల ఘన చరిత్ర. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చామనే పేరు. ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ఉనికిని కోల్పోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. ఆప్ అధికారం చేపట్టే కన్నా ముందు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, ఇప్పుడు మాత్రం ఆ మెరుపులు మెరిపించలేకపోయింది. వరసగా మూడోసారి కాంగ్రెస్ ‘‘డకౌట్’’ అయింది. ఈ సారి కూడా ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్‌కి ‘‘రిక్త హస్తమే’’ మిగిల్చింది.
Read Also: Delhi Election Results : ఢిల్లీ ఫలితాలపై జమ్మూకాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా సంచలన ట్వీట్
70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఒక్క చోట కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో లేదు. ఎర్లీ ట్రెండ్స్‌లో బద్లీ నియోజకవర్గంలో ఆధిక్యంలో కనిపించినప్పటికీ, ప్రస్తుతం ఈ స్థానంలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో ఆ ఒక్కస్థానం కూడా కాంగ్రెస్ చేజారింది. 2013 వరకు వరసగా 15 ఏళ్ల పాటు దేశ రాజధాని పాలించినే కాంగ్రెస్, ఇప్పుడు ఢిల్లీలో తమ ప్రాతినిధ్యం లేకుండా ఉంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ వంటి వారు ప్రచారం చేసినప్పటికీ, ప్రభావం లేకుండా పోయింది.
చివరిసారిగా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 08 సీట్లు గెలుచుకుంది. ఆ సమయంలో బీజేపీ 31 సీట్లతో మెజారిటీ మార్కుకి 5 స్థానాలకు దూరంగా నిలిచింది. 28 సీట్లు గెలుచుకున్న ఆప్‌తో కాంగ్రెస్ జతకట్టింది. వీరిద్దరి ప్రభుత్వం 49 రోజుల పాటు కొనసాగింది. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ వరసగా సున్నాకు పరిమితమైంది. అంతకుముందు ఢిల్లీ అసెంబ్లీకి 8 సార్లు ఎన్నికలు జరిగితే, 04 సార్లు కాంగ్రెస్ గెలిచింది. 2015, 2020లో సున్నాకే పరిమితమైంది.