Tamil Nadu Governor: తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవి- సీఎం స్టాలిన్ మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా, గవర్నర్ రవి మరో పంచాయతీకి తెర లేపాడు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఊటీలో విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్లు, రిజిస్ట్రార్ల కోసం రెండు రోజుల సదస్సును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తమిళనాడుకు చెందిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తీవ్రంగా విమర్శించాయి. గవర్నర్ చర్యలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులకు అనుమతి ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కె. సెల్వపెరుంతగై ఆరోపించారు. ఇక, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గవర్నర్ ఆర్ఎన్ రవి రాజీనామా చేసి ఉండాలి అన్నారు. ఆ తీర్పును గౌరవించకుండా వైస్-ఛాన్సలర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడం రాజ్యాంగాన్ని ఆగౌరవపర్చడమే అన్నారు.
Read Also: Yash : ‘రామాయణ’ కోసం అన్నగారు ఎన్టీఆర్ సెంటిమెంట్ ఫాలోఅవుతున్న యష్
కాగా, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి “ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్”గా వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం ఆరోపించారు. వైస్-ఛాన్సలర్లు ఈ సమావేశానికి హాజరు కావొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గవర్నర్ జీర్ణించుకోలేక ఈ సమావేశం ద్వారా మరోసారి రాష్ట్రంలో వివాదాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారు పేర్కొన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగిస్తూ తమిళనాడు అసెంబ్లీ బిల్లులు ఆమోదించింది.. సుప్రీంకోర్టు కూడా ఆ బిల్లులను ఆమోదించిందని సీపీఐ(ఎం) కార్యదర్శి షణ్ముగం గుర్తు చేశారు.