పెట్రోల్ ధరల తగ్గింపు అంశంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించామని చెబుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అంకెల లెక్కల గారడీ చేస్తున్నారని… కేంద్ర ప్రజలకు ఉపశమనం కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. గత 60 రోజుల్లో కేంద్రం పెట్రోల్ ధరలను రూ. 10కి పెంచిందని… కేవలం ఇప్పుడు రూ.9.5 తగ్గించిందని, కనీసం పెంచినంత కూడా తగ్గించలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా విమర్శించారు. 2014 యూపీఏ టైంలో పెట్రోల్, డిజిల్ ధరల ఉన్న స్థాయికి తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశిస్తూ… ‘డియర్ ఎఫ్ఎం 60 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ. 10 పెంచారు, ఇప్పుడు రూ. 9.5 తగ్గించారు. డిజిల్ పై రూ. 10 పెంచారు, రూ.7 తగ్గించారు…ప్రజలను మోసం చేయడం ఆపండి. ప్రజలను మోసం చేయడానికి లెక్కల గారడీ అవసరం లేదని.. దేశానికి జుమ్లాలు అవసరం లేదని.. ప్రజలను మోసగించడం ఆపాలని, ఉపశమనం కల్పించేలా ధైర్యాన్ని చూపాలి’ అంటూ ట్వీట్లు చేశారు రణ్ దీప్ సుర్జేవాలా.కాంగ్రెస్ హయాంలో మే 2014లో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటర్ కు రూ. 9.48 అని .. ఇప్పుడిది రూ.19.90గా ఉందన్నారు. డీజిల్‌పై ఎక్సైజ్ సుంకంపై రూ. 3.56 ఉంటే.. ఇప్పడు రూ. 15.80 ఉందని విమర్శించారు సుర్జేవాలా.
దేశవ్యాప్తంగా ఉన్న ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ నిరంతర నిరసనలు చేస్తుందని… ఇటీవల ఉదయ్ పూర్ నవకల్పన చింతన్ శిబిర్ తోనే బీజేపీ పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గించిందని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. ఎంపీ మానిక్కం ఠాగూర్.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అహంకారి అని, ఆమె ధనవంతులకు మద్దతు ఇస్తుందని.. మధ్యతరగతి వర్గాలకు కాదని విమర్శించారు.