Coin Stuck In Throat: 12 ఏళ్ల బాలుడి గొంతులో ఇరుక్కున్న నాణేన్ని ఏడేళ్ల తర్వాత తొలగించిన అరుదైన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. హర్డోయ్ జిల్లా ఆస్పత్రిలో ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ వివేక్ సింగ్ మరియు అతని బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. సంక్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యలు బృందం విజయవంతంగా నాణేన్ని తొలగించింది. ఏళ్ల తరబడి అనుభవిస్తున్న నొప్పి, వేదన నుంచి బాలుడు విముక్తి పొందాడు.
Read Also: Kangana Ranaut: కంగనాని చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్‌కి మద్దతుగా రైతుల సంఘాల నిరసన..
రాష్ట్రంలోని బఘౌలీలోని మురళీపూర్వ గ్రామానికి చెందిన అంకుల్ అనే బాలుడికి ఏప్రిల్‌లో కడుపునొప్పి రావడంతో కష్టాలు మొదలయ్యాయి. ప్రైవేట్ వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్నప్పటికీ, జూన్ 4న అతను గొంతు నొప్పిగా ఉందని చెప్పడంతో అతని తాత అతడిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించిన తర్వాత బాలుడి గొంతులో రూపాయి నాణేం ఇరుక్కుని ఉందని చెప్పారు. టెలిస్కోప్ పద్దతిని ఉపయోగించి సర్జరీ చేసిన వైద్యులు నాణేన్ని తొలగించారు.
ఏడేళ్ల పాటు బాలుడి గొంతులోనే నాణేం ఇరుక్కుపోయి ఉందని, ఇలాంటివి చూడటం చాలా అరుదని, ఇది బాలుడి ఎదుగుదలను మాత్రమే కాకుండా అతని శారీరక ఎదుగుదలను కూడా ప్రభావితం చేసింది, పిల్లాడు 12 ఏళ్ల వయస్సున్న పిల్లాడిలా లేదని డాక్టర్ వివేక్ సింగ్ చెప్పారు. ఇలాంటి కేసుల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ అని, తొలగించిన తర్వాత కూడా అబ్బాయికి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీంతో రెగ్యులర్ చెకప్‌కి రావాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు వెల్లడించారు.