దేశంలో అన్ని ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు పెట్రోల్ ధరలు.. మరోవైపు గ్యాస్ ధరలు సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా ఇప్పుడు సీఎన్‌జీ గ్యాస్ ధరల వంతు వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో సీఎన్‌జీల ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కిలో సీఎన్‌జీపై రూ.2 చొప్పున భారం మోపింది. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.73.61కి చేరింది. అటు నోయిడాలో రూ.76.71, గుర్‌గావ్‌లో రూ.81.94, రేవారిలో రూ.84.07, కైతాలిలో రూ.82.27, ఫతేపూర్, కాన్పూర్‌లో రూ.85.40గా కిలో సీఎన్‌జీ ధరలు పలుకుతున్నాయి.
గత నెలలో కూడా సీఎన్‌జీ ధరలు పెరగ్గా.. ఈ నెలలో కూడా అవి మరోసారి పెరిగాయి. ఏప్రిల్ మొదటి వారంలో కిలో సీఎన్‌జీ ధర రూ.2.50 పెరగగా, పైపుల్లో సరఫరా చేసే గ్యాస్ ధర రూ.4.25 పెరిగింది. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతివారం సామాన్యులపై ఏదో ఒక రూపంలో భారం మోపుతూనే ఉంది. మే 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచగా, గత వారం ఇంటి అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే.