CJI BR Gavai: భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తన తండ్రి కలను తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం, ఆయన తన మాతృభాష మరాఠీలో చదువుకోవడం వల్ల కలిగిన ప్రయోజనాల గురించి వెల్లడించారు. తనకు మెరుగైన భావనాత్మక అవగాహన కలిగేందుకు మరాఠీ సహకరించిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో జరిగిన న్యాయవాదుల కార్యక్రమంలో సీజేఐ తన చిన్ననాటి విషయాలను నెమరువేసుకున్నారు. ‘‘నేను న్యాయమూర్తిగా మారాలని నా తండ్రి కల నెరవేరినందుకు నేను సంతోషంగా ఉన్నాను’’అని భావోద్వేగంతో, కన్నీళ్లను అపుకుంటూ వెల్లడించారు.
Read Also: BRICS Summit: బ్రిక్స్ సమ్మిట్కు హాజరైన ప్రధాని మోడీ.. అంతర్జాతీయ సవాళ్లపై చర్చలు
ఆదివారం, బీఆర్ గవాయ్ గిర్గావ్ లోని చికత్సక్ సముహ్ శిరోద్కర్ పాఠశాలను సందర్శించి, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ స్కూల్‌లో ప్రాథమిక స్థాయి నుంచి మాధ్యమిక స్థాయి వరకు చదువుకున్నారు. తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. ‘‘నేను ఈ రోజు ఎంత ఎత్తుకు చేరుకోవడంలో నా ఉపాధ్యాయులు, ఈ పాఠశాల గణనీయమైన పాత్ర పోషించాయి. ఇక్కడ నేను పొందిన విద్య , విలువలు నా జీవితానికి దిశానిర్దేశం చేశాయి’’ అని చెప్పారు.
‘‘నేను మరాఠీ-మీడియం పాఠశాలలో చదువుకున్నాను. ఒకరి మాతృభాషలో చదువుకోవడం మెరుగైన భావనాత్మక అవగాహనకు సహాయపడుతుంది. జీవితాంతం మీతో పాటు నిలిచి ఉండే బలమైన విలువలను కూడా నింపుతుంది’’ అని అన్నారు. జస్టిస్ గవాయ్ తన సహవిద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మంత్రి, ముంబై నగర సంరక్షక మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా, బాంబే హైకోర్టు న్యాయమూర్తి మాధవ్ జమాదార్ పాల్గొన్నారు.