Maldives: మాల్దీవుల్లోకి చైనా రీసెర్చ్ షిప్ మళ్లీ వచ్చింది. రెండు నెలల క్రితం ఇది మాల్దీవుల్లోని పలు రేవుల్లో తిరిగింది. ప్రస్తుతం ఇది మళ్లీ ద్వీప దేశ జలాల్లోకి వచ్చింది. జియాంగ్ యాంగ్ హాంగ్03 గురువారం థిలాఫుషి ఇండస్ట్రియల్ ఐలాండ్ హార్బర్‌లో డాక్ చేయబడింది. అయితే, ఈ నౌక తిరిగి రావడానికి గల కారణాలను ఆ దేశం వెల్లడించలేదు. ఈ నౌకకు సంబంధించి దాని మొదటి పర్యటనకు ముందే డాకింగ్ చేయడానికి పర్మిషన్ పొందినట్లు తెలుస్తోంది. ఇటీవల మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకు చెందిన పార్టీ భారీ విజయం సాధించింది. పీపుల్స్ అసెంబ్లీలో 93 మంది సభ్యులకు గానూ 66 స్థానాలను గెలుచుకుంది. చైనా అనుకూలుడిగా ముద్ర పడిన ముయిజ్జూ గెలిచిన కొన్ని రోజుల తర్వాత ఈ చైనా నౌక మళ్లీ మాల్దీవుల్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
ముయిజ్జూ గత ఏడాది ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి రాగానే మాల్దీవుల్లో మానవతా కార్యక్రమాలని నిర్వహిస్తున్న భారత ఆర్మీ సిబ్బంది దేశం వదిలిపోవాలని అల్టిమేటం జారీ చేశాడు. ఆ తర్వాత చైనా పర్యటనకు వెళ్లి, ఆ దేశంతో సైనిక ఒప్పందంతో పాటు మరికొన్ని ఒప్పందాలను చేసుకున్నాడు.
Read Also: Lok Sabha Elections: కాషాయ తీర్థం పుచ్చుకున్న కీలక నేతలు
మరోవైపు చైనా పరిశోధన నౌకల ద్వారా భారత్‌పై నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో శ్రీలంకకి కూడా చైనా తన పరిశోధన నౌకల్ని పంపింది. ప్రస్తుతం మాల్దీవులకు వచ్చిన జియాంగ్ యాంగ్ హాంగ్03 జనవరి నుంచి మాల్దీవుల భూభాగం లోపల లేదా సమీపంలో చురుకుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఓడ ఇంతకు ముందు ఫిబ్రవరి 23న మాలేకి పశ్చిమాన 7.5 కి.మీ దూరంలోని తిలాఫుషి నౌకాశ్రయానికి వచ్చింది. మాల్దీవుల్లోని ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్(ఈఈజెడ్) సరిహద్దు దగ్గర ఒక నెల గడిపిన తర్వాత ఇది మాల్దీవుల జలాల్లోకి ఫిబ్రవరి 22న చేరుకుంది. ఆరు రోజుల తర్వాత మళ్లీ ఈఈజెడ్‌కి చేరుకుంది. చైనా ప్రభుత్వం నుంచి మాల్దీవులకు దౌత్యపరమైన అభ్యర్థన వచ్చిన తర్వాత సిబ్బంది రొటేషన్, భర్తీ కోసం ఈ నౌకకు అనుమతి ఇచ్చామని మాల్దీవుల విదేశీమంత్రిత్వ శాఖ వెల్లడించింది. మాల్దీవుల్లో ఉన్నంత వరకు ఇది ఎలాంటి పరిశోధన నిర్వహించదని చెప్పింది.
మాల్దీవుల్లో చైనా తిష్ట వేయడం భారత్‌కి అంత మంచిది కాదు. మాల్దీవులు మన లక్షదీవుల్లోని మినికాయ్ ద్వీపానికి కేవలం 70 నాటికన్ మైళ్ల దూరంలో, ప్రధాన భూభాగానికి 300 నాటికన్ మైళ్ల దూరంలో ఉంది. ఈ మార్గం నౌక రవాణాకు కీలకంగా ఉంది. దీంతో దీనిపై ఆధిపత్యం పెంచుకోవాలని చైనా భావిస్తోంది. ఇప్పటికీ ఈ మార్గాన్ని భారత్ నిర్వహిస్తుంది. మీడియా నివేదిక ప్రకారం.. జియాంగ్ యాంగ్ హాంగ్03 ఓడ 100-మీటర్ల పొడవు గల ఈ నౌకను 2016లో చైనా స్టేట్ ఓషియానిక్ అడ్మినిస్ట్రేషన్ (SOA) నౌకాదళానికి చెందినది. దీని బరువు 4500 టన్నులు. ఇది సముద్రంపై సర్వే చేయడానికి చైనా దీనిని నిర్వహిస్తోంది.