Wagh Nakh: మరాఠా సామ్రాజ్యనేత ఛత్రపతి శివాజీ మహరాజ్ ఉపయోగించిన ఆయుధం ‘‘వాఘ్ నఖ్’’ లేదా పులి పంజాగా పిలిచే ఆయుధం లండర్ మ్యూజియం నుంచి ముంబైకి చేరుకున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ తెలిపారు. దీనిని పశ్చిమ మహారాష్ట్ర సతాలకు తీసుకెళ్లనున్నట్లు, శుక్రవారం నుంచి ప్రదర్శించనున్నట్లు చెప్పారు. సతారాలో వాఘ్‌నఖ్‌కు ఘన స్వాగతం పలుకుతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శంభురాజ్ దేశాయ్ మంగళవారం తెలిపారు.
లండన్ నుంచి తీసుకువచ్చిన ఈ ఆయుధానికి బుల్లెట్ ఫ్రూఫ్ కవర్ ఉందని, భద్రతను కట్టుదిట్టం చేశామని ఆయన తెలిపారు. దీన్ని సతారాలోని మ్యూజియంలో 7 నెలల పాటు ఉంచనున్నట్లు వెల్లడించారు. దేశాయ్ మంగళవారం సతారా జిల్లాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియం వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. మహారాష్ట్రకు వాఘ్ నఖ్‌ని తీసుకురావడం స్పూర్తిదాయకమైన క్షణమని అన్నారు. దాదాపుగా 350 ఏళ్ల తర్వాత శివాజీ ఆయుధం తిరిగి స్వదేశానికి వస్తోంది.
Read Also: Digvijaya Singh: మన ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు…
1959లో బీజాపూర్ రాజ్య జనరల్ అఫ్జల్ ఖాన్‌ని చంపడానికి శివాజీ ఈ పులి పంజా ఆయుధాన్ని ఉపయోగించారు. లండన్‌లోని విక్టోరియా మరియు ఆల్బర్ట్ మ్యూజియం నుండి మహారాష్ట్రకు ఆయుధాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం అనేక కోట్లు ఖర్చు చేసిందన్న వాదన వస్తున్న వేళ వీటిని మంత్రి మునిగంటివార్ తిరస్కరించారు. ప్రయాణ ఖర్చులు, ఒప్పందంపై సంతకాలు చేయడానికి రూ. 14.08 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. లండన్ మ్యూజియం తొలుత ఏడాదిపాటు ఆయుధాన్ని ఇచ్చేందుకు అంగీకరించిందని, అయితే మహారాష్ట్ర దానిని మూడేళ్లపాటు రాష్ట్రంలో ప్రదర్శనకు అప్పగించేందుకు ఒప్పించిందని తెలిపారు. చాలా ప్రయత్నాల తర్వాత సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ప్రయత్నాల కారణంగా వాఘ్ నఖ్ మహరాష్ట్రకు వస్తుందని చెప్పారు.