Truckers Protest: కేంద్రం తీసుకువచ్చిన కొత్త హిట్-అండ్-రన్ చట్టంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ట్రక్కు, బస్సు, ట్యాంకర్ ఆపరేటర్లు ఆందోళనలు చేపట్టారు. సోమవారం నుంచి ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు ట్రక్కు డ్రైవర్ల ఆందోళలతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల మందు వాహనదారులు క్యూ కట్టారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
ఇదిలా ఉంటే డ్రైవర్ల సమ్మె ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో కేంద్రం కాసేపట్లో కీలక భేటీ నిర్వహించనుంది. దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ రోజు ఉన్నతస్థాయి సమావేశానికి పిలుపునిచ్చినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో ట్రాన్స్‌పోర్టర్స్ యూనియన్ పాల్గొననుంది.
Read Also: Fact-Check: ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ చనిపోయాడా..? నిజం ఇదే..
ఇటీవల కేంద్రం భారత న్యాయ సంహిత చట్టాన్ని తీసుకువచ్చింది. కొత్త క్రిమినట్ చట్టం ప్రకారం.. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు కారణమవ్వడమే కాకుండా, అధికారులకు సమాచారం ఇవ్వకుండా పారిపోయే డ్రైవర్లకు 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇంతే కాకుండా లక్షల్లో జరిమానా కూడా విధిస్తుంది.
దీంతో ఈ చట్టంపై డ్రైవర్లు, ట్రక్కర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లో సోమవారం ట్రక్కు డ్రైవర్లు కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. మంగళవారం దేశంలోని పలు నగరాల్లో రోడ్లను దిగ్భందించి, నిరసన వ్యక్తం చేశారు.