Fact-Check: భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ పాకిస్తాన్‌లో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో చనిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ వ్యాప్తంగా భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని ఒక్కొక్కరిగా గుర్తుతెలియని వ్యక్తులు హతమారుస్తున్న నేపథ్యంలో ఇది కూడా నిజమని చాలా మంది భావించారు. ముఖ్యంగా భారత్‌లోని చాలా మంది ఈ వార్తలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. దీనికి ముందు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై ఇటీవల విషప్రయోగం జరిగిందని, ఆయన మరణించాడనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా మసూద్ అజార్ మరణించాడని సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు, వీడియోలు ఫేక్ అని తేలింది. పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కాకర్, అజార్ మరణాన్ని ధృవీకరిస్తు్న్న స్క్రీన్ షాట్స్ కూడా నకిలీవని తేలింది.
ఉదయం 5 గంటలకు మసీదు నుంచి తిరిగి వస్తుండగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ బావల్పూర్‌లో జరిగిన బాంబు దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మరణించినట్లు పలు హ్యాండిల్స్ పేర్కొన్నాయి. వ్యక్తిగత కక్షల కారణంగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ పేలుడుకు పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ లోని ఏ ప్రధాన మీడియా కూడా ఈ విషయాన్ని నివేదించలేదు. ముందుగా కాలిపోతున్న ఓ కారు పోస్టును పోస్ట్ చేసింది టైమ్ ఆల్జీబ్రా అనే హ్యాండిల్. ఇదే ఫొటోను ముజఫరాబాద్ న్యూస్ బులెటిన్ కూడా వాడింది.
Read Also: Delhi High Court: భర్తపై అలాంటి ఆరోపణలు చేయడం భార్య క్రూరత్వానికి పరాకాష్ట..
అయితే, ఈ ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. నవంబర్ 3న, పాక్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్‌లో పోలీస్ వ్యాన్ లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ఈ ఘటనలో 6 మంది చనిపోగా.. 25 మంది గాయపడినట్లు OSINT అనే ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. పోస్టులోని ఫోటోలను రీసైకిల్ చేసినట్లు తెలుస్తోంది. వీటిని 2019లో హస్నన్ అలీ అనే హ్యాండిల్ మొదటిసారిగా పోస్ట్ చేసింది. ఈ పేలుడులో ముగ్గురు టిక్ టాకర్ల్ మరణించినట్లు క్యాప్షన్ కూడా పెట్టారు.
మసూద్ అజార్ భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. భారతదేశంలో పలు ఉగ్రవాద దాడుల్లో ఇతని ప్రమేయం ఉంది. 2001 పార్లమెంట్ దాడి, 2005 అయోధ్యలో దాడి, 2019 పుల్వామా అటాక్‌తో పాటు, ముంబై దాడుల్లో కూడా ఇతర ప్రయేయం ఉంది. జనవరి 2016లో ఆఫ్ఘనిస్తాన్ మజార్ ఏ షరీఫ్ లోని భారత కాన్సులేట్‌పై దాడికి కూడా పాల్పడ్డాడు.