ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు నరకం చూస్తున్నారు.. కొనే పరిస్థితి లేదు.. అమ్మడానికి కూడా ఏమీ లేదు అనే తరహాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. ఇప్పటికే శ్రీలంకకు భారత్ భారీ సాయం చేయగా.. ఇప్పుడు.. శ్రీలంకలోని తమిళులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తరపున కోటి రూపాయలు విరాళంగా ఇవ్వనున్నారు.. ప్రభుత్వం తరపున మొదటి విడతగా 40 వేల టన్నుల బియ్యం, 500 టన్నుల మిల్క్ పౌడర్, సహా అత్యవసరమైన మందులు పంపిణీ చేయనున్నారు.. మొత్తం, రూ.123 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు, సరుకులను సరఫరా చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. శ్రీలంక తమిళులకు చేయూత నివ్వాలని ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేశారు సీఎం స్టాలిన్.
Read Also: Marriage: 15 ఏళ్లుగా సహజీవనం.. ఒకేసారి ముగ్గురు మహిళలతో పెళ్లి..
కాగా, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో అత్యవసర, నిత్యావసర వస్తువులను కొనలేని పరిస్థితి వచ్చింది.. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో అక్కడి ప్రజలు కనీసం నిత్యావసర సరుకులను కూడా కొనుగోలు చేయడం భారంగా మారింది. పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాస్, నిత్యావసరాలు ఏవైనా కొనుగోలు చేయాలంటే గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు, విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ లేని కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను కూడా మూసివేయాల్సిన పరిస్థితి.. ఈ క్రమంలో శ్రీలంకకు భారత్ సహా మిత్రదేశాలు స్నేహహస్తం అందిస్తూ.. సాయం చేస్తున్న విషయం తెలిసిందే కాగా.. స్టాలిన్ సర్కార్ కూడా శ్రీలంకకు అత్యవసర వస్తువులను, ఆహార పదార్థాలు, మందులను అందజేయాలని నిర్ణయించింది. మరోదేశానికి పంపే పనికాబట్టి.. నేరుగా శ్రీలంకకే పంపే అవకాశం లేకపోవడంతో.. కేంద్రం అనుమతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి.. గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపింది.. మరోవైపు, సీఎం స్టాలిన్ కూడా ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇక, కేంద్రం నుంచి అనుమతి రావడంతో.. త్వరలోనే తమిళనాడు సాయం.. శ్రీలంకకు అందనుంది.