బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందా? కావాలనే శకటాలను ఎంపిక చేయలేదా? అన్న ప్రశ్నలు మరోసారి తెరమీదకు వచ్చాయి. రిపబ్లిక్ డే శకటాల విషయంలో.. కేంద్ర-రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకుంది. అయితే దీనితో తమకు సంబంధం లేదని చెబుతోంది కేంద్రం. గణతంత్ర వేడుకల్లో కొన్ని రాష్ట్రాల శకటాలకు ప్రాతినిధ్యం లభించకపోవడం పట్ల కేంద్రం, ఆయా రాష్ట్రాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి.
తెలుగు రాష్ట్రాల శకటాలకు మరోసారి అనుమతి దక్కలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో 12 రాష్ట్రాలు, 9 శాఖల శకటాలకు అనుమతినిచ్చింది కేంద్రం.. తెలంగాణ, ఏపీకి మాత్రం మళ్లీ నిరాశే మిగిల్చింది. దక్షిణాదిలో ఒక్క కర్ణాటక తప్పా.. మిగతా రాష్ట్రాల శకటాలను ఎంపిక చేయలేదు. శకటాల విషయంలో కేంద్ర-రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే బెంగాల్ శకటాన్ని కేంద్రం కావాలనే ఎంపిక చేయలేదని.. తమ రాష్ట్ర శకటాన్ని తిరస్కరించి బెంగాల్ ప్రజలను అవమానించారని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. దీనిపై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు.
తమ రాష్ట్రాల శకటాలకు స్థానం కల్పించకపోవడంపై పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ శకటాన్ని తిరస్కరించడంపై ముఖ్యమంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు కేరళతో పాటు పలు రాష్ట్రాల నేతలు కూడా తమ రాష్ట్రాన్ని అవమానించారంటూ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో శకటాల లొల్లి తారా స్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదాస్పదమైంది.
మమతా, స్టాలిన్ విమర్శలపై కేంద్రం స్పందించింది. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రతిపాదించిన శకటాలను తిరస్కరించడంలో తమ పాత్రేమి లేదని.. ఏయే శకటాలను అనుమతించాలనేది నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పింది. రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని తెలిపింది కేంద్రం. ఈ వివాదంపై జర్మనీలో ఉంటున్న నేతాజీ కుమార్తె అనితా బోస్ కూడా స్పందించారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా జరుగుతున్న గణతంత్ర ఉత్సవాల్లో.. ఆయన గుర్తుగా రూపొందించిన శకటం లేకపోవడం వింతగా ఉందన్నారు. ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయని విమర్శించారామె.
2018, 2021 గణతంత్ర వేడుకల్లో కేరళ శకటానికి స్థానం దక్కించుకుంది. తమిళనాడు శకటం 2016, 2017, 2019, 2020, 2021 వేడుకల్లో… పశ్చిమ బెంగాల్ శకటం 2016, 2017, 2019, 2021 ఉత్సవాల్లో ప్రాతినిధ్యం వహించాయి. సున్నితమయిన అంశాలపై విమర్శలు చేయడం మంచిదికాదంటోంది బీజేపీ.