Jyoti Malhotra Case: హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై దేశద్రోహం ఆరోపణలతో విచారణను భారత ఇంటెలిజెన్స్ ముమ్మరం చేసింది. ఈ కేసులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారుల పాత్రను లోతుగా పరిశీలిస్తుంది. ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని ఆలోచనలో కేంద్ర హోం శాఖ ఉంది. ఈ ఏజెన్సీ దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన కేసులను మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది. కాగా, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో జ్యోతి మల్హోత్రాకు ఉన్న సంబంధాలు, ఆమె అంతర్జాతీయ పర్యటనలు, సమాచార బదిలీపై మరిన్ని వివరాలను సేకరించడానికి ఈ ఏజెన్సీ ఎంక్వైరీ చేయనుంది.
Read Also: Health Tips: ఈ ఆహారపు అలవాట్లు కిడ్నీల్లో రాళ్లకు కారణం.. ఈ తప్పులు అస్సలు చేయకండి
అయితే, జ్యోతి మల్హోత్రా వెనుక భారీ కుట్ర దాగి ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. యూట్యూబర్ జ్యోతితో సహా మొత్తం 14 మంది పాక్ గూఢచారులను ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అరెస్టు చేశారు. ఈ వ్యక్తులు పాకిస్తాన్ ఐఎస్ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా పని చేసినట్లు విచారణలో తేలింది. గత రెండు వారాలుగా నార్త్ ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఈ అరెస్టులు కొనసాగాయి. దర్యాప్తు సంస్థలు జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న దేశంలోని ఇతర వ్యక్తులను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ కుట్రలో పాకిస్తాన్ హైకమిషన్ అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు.