దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే మాస్కులు ధరించే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగిన చిన్నారులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ సమయంలో మాత్రమే ఆరేళ్ల నుంచి 11 ఏళ్ల వయస్సు పిల్లలు మాత్రమే మాస్క్ ధరించేలా చూడాలని సూచించింది. ప్రతి ఒక్కరూ మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Read Also: భారీగా పెరిగిన సెంట్రల్ విస్టా ఖర్చు.. డెడ్‌లైన్ పొడిగింపు
ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పెద్దల మాదిరిగానే మాస్క్ ధరించాలని కేంద్రం తెలిపింది. ఇతర దేశాల నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల వచ్చే వ్యాధి తీవ్రత తక్కువగా ఉందని కేంద్రం వెల్లడించింది. కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రతతో సంబంధం లేకుండా 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి యాంటీవైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాడొద్దని సూచించింది. స్టెరాయిడ్స్‌ను సరైన సమయంలో, సరైన మోతాదులో సరైన వ్యవధిలో వాడాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.