Waqf protest: వక్ఫ్ సవరణ చట్టం-2025కి వ్యతిరేకంగా బెంగాల్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిరసనల పేరుతో అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడుతున్నారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయి. నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్ష నెలకొంది. ఈ ప్రాంతంలో కీలకమైన రహదారిని అడ్డుకోకుండా పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
గత వారం పార్లమెంట్ ఉభయసభల్లో సుదీర్ఘ చర్చల అనంతరం వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు వక్ఫ్ చట్టంగా మారింది. ఈ రోజు (ఏప్రిల్ 8, 2025) నుంచి బిల్లు అమలులోకి వచ్చినట్లు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Also: Smartphone: భారత్ నుంచి రూ. 2 లక్షల కోట్ల స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు.. టాప్ బ్రాండ్ ఇదే..
ఇదిలా ఉంటే, ముర్షిదాబాద్ ఘర్షణలపై బెంగాల్ లోని మమతా బెనర్జీ టీఎంసీ ప్రభుత్వాన్ని బీజేపీ నేత అమిత్ మాల్వియా విమర్శించారు. ముర్షిదాబాద్ వీధుల్లో హింసాత్మక ఇస్లామిక్ మూకల్ని అదుపు చేయడానికి పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం, హోం మంత్రి మమతా బెనర్జీ సూచనలు ఇందుకు ఉపయోగపడినట్లు ఉన్నాయి అని అమిత్ మాల్వియా అన్నారు.
జంగీపూర్‌లో పోలీసులతో జరిగిన ఘర్షణలో నిరసనకారులు రాళ్లు రువ్వారు. జాంగీపూర్‌లో ఇంటర్నెట్ సేవల్ని పరిమితం చేశారు. ఇటీవల కార్తీక పూజ వేడుకల సందర్భంగా హిందువులపై ఈ ప్రాంతంలో పదేపదే దాడులు జరిగాయి, ఉద్రికత పెరగడంతో అనేక రైళ్లు నిలిచిపోయాయని అమిత్ మాల్వియా అన్నారు. మమతా బెనర్జీ ముస్లిం బుజ్జగింపు రాజకీయంతో బెంగాల్‌ని బంగ్లాదేశ్‌గా మార్చుతోందని మాల్వియా అన్నారు.