Smartphone: భారత్ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి, ఎగుమతుల్లో దూసుకుపోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఏకంగా రూ. 2 లక్షల కోట్ల స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయ్యాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తెలిపారు. ఈ ఎగుమతుల్లో దాదాపుగా రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ‘‘ఐఫోన్’’ షిప్‌మెంట్లు ఉన్నాయని వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంతో చూస్తే స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 54 శాతం వృద్ధి సాధించినట్లు కేంద్రమంత్రి అన్నారు. గత 10 ఏళ్లలో భారత దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ ఐదు రెట్లు ఎక్కువగా, ఎగుమతులు 6 రెట్లు పెరిగినట్లు ఆయన అన్నారు.
Read Also: Waqf Act: అమలులోకి వచ్చిన వక్ఫ్ చట్టం.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ..
కేంద్ర ప్రభుత్వం రూ.22,919 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ స్కీమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రాబోయే మూడు వారాల్లో విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై ప్రజలతో సంప్రదింపుల కోసం రెండు వారాల గడువు ఉంటుందని, వారి నుంచి ఇన్‌పుట్స్ సేకరిస్తామని, మూడు వారాల్లో ఈ పథకం అమలులో కి వస్తుందని, పోర్టల్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తామని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ పథకం కింద క్యాపిటల్ పరికరాల తయారీకి మద్దతు ఇస్తామని, ఈ పరికారాలు అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉపయోగించబడుతాయని ఆయన అన్నారు.
రెసిస్టర్లు, కెపాసిటర్లు, ఇండక్టర్లు, కాయిల్స్, స్పీకర్లు, రిలేలు, స్విచ్‌లు, కనెక్టర్లు, యాంటెన్నాలు, మోటార్లు, ఫిల్టర్లు, నాన్-చిప్ సెన్సార్లు, ట్రాన్స్‌డ్యూసర్లు, లామినేట్లు, కాపర్ ఫాయిల్స్, సెపరేటర్లు, కాథోడ్ అండ్ ఆనోడ్ మెటీరియల్స్ వంటి భాగాలు తయారు చేయబడతాయి కాబట్టి ఈ పథకం అనేక రంగాలపై ప్రభావాన్ని చూపుతుంది అని అన్నారు.