Bulldozers roadshow: రాజస్థాన్ చివరి రోజు ప్రచారం హోరెత్తింది. ఈ నెల 25న రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారానికి ఈ రోజే చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు జోరుగా ప్రచారం సాగించారు. గురువారం చిత్తోర్‌గఢ్ జిల్లాలోని నింబహెరా, రాజ్ సమంద్ జిల్లాల్లో నాథ్‌ద్వారాలో కేంద్రహోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేలు కూడా జైపూర్‌లోని వివిధ అసెంబ్లీల్లో బీజేపీ అభ్యర్థుల తరుపున రోడ్‌షోలు నిర్వహించారు. మేవార్ రాజకుటుంబ సభ్యుడు, మహారాణా ప్రతాప్ వారసుడైన విశ్వరాజ్ సింగ్ మేవార్‌కి మద్దతుగా అమిత్ షా రోడ్ షో నిర్వహించారు.
Read Also: Jungle Safari: జంగిల్ సఫారి.. పర్యాటకుల కారెక్కిన సింహం.. ఆ తర్వాత ఏమైందంటే..!
యోగి ఆదిత్యనాథ్ జోత్వారా, షిండే హవా మహల్ నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా యోగి ప్రచారం చివరి రోజు హైలెట్‌గా నిలిచింది. బుల్డోజర్లలో యోగి రోడ్ షో సాగింది. పదుల సంఖ్యలో బుల్డోజర్లు రోడ్డుకు ఇరువైపుల ఉండగా, వాటిపై నుంచి యోగి ప్రచార వాహనంపై అభిమానులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో బీజేపీ ఈ సారి అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటోంది. ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. రాజస్థాన్‌లో అవినీతి, మహిళపై దాడులను ప్రధాన ప్రచారాస్త్రాలుగా బీజేపీ, కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తోంది. రాజస్థాన్ చరిత్రను చూసుకుంటే ఇప్పటి వరకు ఏ పార్టీని కూడా అక్కడి ప్రజలు రెండోసారి అధికారం ఇవ్వలేదు.