Bulldozer Action: బుల్డోజర్ ఇప్పుడు గ్యారేజీలో ఉంటుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ‘‘బుల్డోజర్ న్యాయం’’ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. బుల్డోజర్ జస్టిస్‌కి కేరాఫ్‌గా ఉన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విరుచుకుపడ్డారు. నవంబర్ 20న ఉప ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని 9 నియోజకవర్గాల్లోని సిసామావు నుంచి ఆయన ప్రసంగించారు.
‘‘ సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు తెలిసి ఉండాలి. ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న బుల్డోజర్ న్యాయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించింది. ఈ తీర్పు ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు’’ అని అఖిలేష్ అన్నారు. ఇళ్లను కూల్చే వ్యక్తల నుంచి ఏమి ఆశించాలి..? కనీసం వారి బుల్డోజర్ గ్యారేజీలో ఉంటుంది, పేదల ఇళ్లు ధ్వంసం చేయబడవు అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించిన కీలక వ్యాఖ్యాలను అఖిలేష్ యాదవ్ ప్రస్తావించారు. ‘‘ప్రతి ఒక్కరూ ఇంటి కోసం కలలు కంటారు, ఒక వ్యక్తి ఇంటిని కట్టుకోవాలని కలలు కంటాడు’’ అని ఆయన అన్నారు. ప్రభుత్వంపై ఇంతకంటే బలమైన విమర్శలు ఉండవని చెప్పారు.
అయితే, బుల్డోజర్ బాబాగా పేరు సంపాదించిన యోగి ఆదిత్యనాథ్ ఏఎన్ఐ పాడ్‌కాస్ట్‌లో స్పందించారు. ల్యాండ్ మాఫియాపై ప్రభుత్వం పోరాడుతోందని, ఏ అమాయకులపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేస్తే వారికి హారతి ఇస్తామా..? అని ప్రశ్నించారు.
Read Also: Modi-Nitish Kumar: మోడీ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన నితీష్ కుమార్.. మోడీ ఏం చేశారంటే.?
బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక వైఖరిని తీసుకుంది. కూల్చివేతలు నిర్వహించడానికి మార్గదర్శకాలను నిర్దేశించింది. నేరాలకు పాల్పడిన వ్యక్తులపై బుల్డోజన్ న్యాయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఉద్యోగులు, న్యాయమూర్తుల్ని భర్తీ చేయలేరని కోర్టు తన తీర్పులో పేర్కొంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వ్యవమరిచే ప్రభుత్వ అధికారులు జవాబుదారీతనం ఉండాలని కోర్టు పేర్కొంది.
‘‘సహజ న్యాయం యొక్క ప్రాథమిక సూత్రాలను అనుసరించడంలో అధికారులు విఫలమైనప్పుడు మరియు సరైన ప్రక్రియ యొక్క సూత్రాన్ని పాటించకుండా ప్రవర్తించినప్పుడు, బుల్డోజర్ భవనాన్ని కూల్చివేస్తున్న దృశ్యం, చట్టవిరుద్ధమైన వ్యవహారాలను గుర్తుచేస్తుంది’’ అని కోర్టు చెప్పింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలను తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. రోడ్డు, వీధి, ఫుట్‌పాత్, రైల్వే లైన్‌లు లేదా నీటి వనరుల వంటి బహిరంగ ప్రదేశాల్లో అనధికారిక నిర్మాణాలకు మరియు న్యాయస్థానం ద్వారా కూల్చివేతకు ఆదేశాలు ఉన్న సందర్భాల్లో తమ ఆదేశాలు వర్తించవని బెంచ్ స్పష్టం చేసింది.