Bombay High Court: జీవిత భాగస్వామిని బెదిరించడం లేదా ఆత్మహత్యకు ప్రయత్నించడం విడాకులకు కారణమే అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కీలక తీర్పు చెప్పింది. తన భార్య ఆత్మహత్య చేసుకుంటానని తన కుటుంబాన్ని బెదిరిస్తోందని ఓ వ్యక్తి ఆరోపించాడు. జీవిత భాగస్వామిని బెదిరించడం అనేది క్రూరత్వం కిందకు వస్తుందని, విడాకులకు ఇవ్వడానికి కారణం అని హైకోర్టు చెప్పింది.
హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌కు చెందిన జస్టిస్ ఆర్.ఎం. జోషి గత నెలలో ఒక జంట వివాహాన్ని రద్దు చేస్తూ ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన తీర్పుని సమర్థించారు. ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సదరు మహిళ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ తీర్పు వెలువడింది. ఆత్మహత్య చేసుకుంటానని తన భార్య బెదిరిస్తోందని, తనను తన కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని చెబుతోందని సదరు మహిళ భర్త ఆరోపించారు. హిందూ వివాహ చట్టం ప్రకారం.. ఇది క్రూరత్వానికి సమానమే అని ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: CM Revanth Reddy : వాళ్లకి జైల్లో డబుల్‌రూం కట్టిస్తానని హామీ ఇచ్చా.. ఆ హామీ కూడా ఇంకా నెరవేర్చేలేదు
జీవిత భాగస్వామి చేసిన ఇలాంటి చర్య ఎంతటి క్రూరత్వానికి దారితీస్తుందంటే, అది విడాకులకు కారణమవుతుందని హైకోర్టు పేర్కొంది. విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు తీర్పుని రద్దు చేయడానికి నిరాకరించింది. ఫ్యామిలీ కోర్టు తీర్పులో ఎలాంటి వక్రీకరణ కనిపించడం లేదని, అందువల్ల తీర్పులో జోక్యం అవసరం లేదని పేర్కొంది.
ఈ కేసులోని జంటకు 2009లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, తన అత్తమామలు తన ఇంటికి వచ్చి తరుచూ, తన వైవాహిక జీవితంలో జోక్యం చేసుకునే వారని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. 2010లో తన భార్య తన ఇంటిని వదిలి వెళ్లి తన తల్లిదండ్రుల ఇంటి వద్దే ఉందని, తిరిగి రావడానికి నిరాకరించిందని, తన భార్య ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించిందని, ఒకసారి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని ఆ వ్యక్తి తన భార్యపై ఆరోపణలు చేశారు. తన భార్య తన కుటుంబంపై తప్పుడు ఫిర్యాదు చేసి జైలుకు పంపుతానని బెదిరించేదని చెప్పాడు. అయితే, తన భర్త అతడి తండ్రి తనను వేధించేవారని, అందుకే పుట్టింటికి వెళ్లినట్లు ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది.