High Court: 2015లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో 25 ఏళ్ల వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. బాలిక చేయి పట్టుకుని ‘‘ఐ లవ్ యూ’’ అని చెప్పినందుకు నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు విధించిన 3 ఏళ్ల జైలు శిక్షను హైకోర్టు రద్దు చేసింది. నిందితుడి తరుపున కోర్టులో వాదించిన న్యాయవాది సోనాలి ఖోబ్రగడే సెషన్స్ కోర్టు తీర్పుపై అప్పీలు చేశారు. లైంగిక వేధింపులను నిరూపించేందుకు ఈ కేసులో నిందితుడి లైంగిక ఉద్దేశ్యం లేదా లైంగిక డిమాండ్ వంటివి లేవని హైకోర్టుకు తెలిపారు.
Read Also: India-US trade deal: అమెరికా ఒత్తిడికి తలొగ్గని భారత్.. వాణిజ్య ఒప్పందంలో ప్రతిష్టంభన..
కేసును పరిశీలించిన జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎవరైనా తానున మరోక వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెబితే లేదా తన భావాలను వ్యక్తపరిస్తే అది ఒక రకమైన లైంగిక ఉద్దేశాన్ని చూపించేదిగా పరిగణించబడదు.’’ అని చెప్పింది. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని వ్యక్తీకరించబడిన పదాలు లైంగిక ఉద్దేశంగా పరిగణించబడవని కోర్టు చెప్పింది. లైంగిక ఉద్దేశ్యం అనేది ఇతర చర్యల ద్వారా ప్రతిబింబించినప్పుడు మాత్రమే దానిని నేరంగా చెప్పవచ్చని హైకోర్టు చెప్పింది. నిందితుడు, బాలికతో లైంగిక సంబంధం ఏర్పరచుకునేలా నిజమైన ఉద్దేశం కలిగి ఉన్నాడనేలా ఒక్క సందర్భం కూడా లేదని కోర్టు పేర్కొంది. నిందితుడు లైంగిక ఉద్దేశ్యంతో బాధితురాలి ప్రైవేట్ భాగాన్ని తాకాడని, అందులో శారీరక సంబంధం ఉందని ఎలాంటి ఆరోపణలు లేనందున పోక్సో చట్టం కింద నేరం రుజువు కాలేదని చెప్పింది.
17 ఏళ్ల బాలిక అక్టోబర్ 23, 2015న ఫిర్యాదు చేసింది, ఆ రోజు మధ్యాహ్నం 1:00 గంటల ప్రాంతంలో స్కూల్ బస్ దిగి తన బంధువుతో కలిసి ఇంటికి వెళ్తున్న క్రమంలో, ఒక వ్యక్తి తన మోటార్‌సైకిల్‌పై ఆమెను అడ్డగించాడని ఆరోపించింది. అతను ఆమె చేయి పట్టుకుని, ఆమె తన పేరును వెల్లడించే వరకు, వెళ్లనివ్వనని చెప్పింది. ఆ సమయంలో సదరు వ్యక్తి “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని కూడా చెప్పాడు. దీనిపై బాలిక తండ్రి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశాడు.