India-US trade deal: ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అమెరికాకు చెందిన నేతలు మాట్లాడుతూ.. భారత్‌తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని చెబుతున్నారు. కానీ, పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా, కొన్ని రంగాల్లోకి అమెరికాను అనుమతించేందుకు భారత్ ఒప్పుకోవడం లేదు. ఇండియాపై ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గడం లేదు. దీంతో, పరస్పర సుంకాల అమలులోకి రావడానికి జూలై 09 తుది గడువుగా ఉన్నప్పటికీ, ఆలోపు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడం కష్టంగానే కనిపిస్తోంది.
ప్రభుత్వ వర్గాల ప్రకారం, భారతదేశంలో 80 మిలియన్ల మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న డెయిరీ రంగం విషయంలో భారత్ వెనక్కి తగ్గడానికి నిరాకరించింది. ఈ రంగంలో ఎక్కువగా చిన్న రైతులే ఉన్నారు. డెయిరీ రంగంలో అమెరికా ఒత్తిడిని ఒప్పుకునే ప్రశ్నే లేదని, దీనిని భారత్ ‘‘రెడ్ లైన్’’గా భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంగళవారం వాషింగ్టన్‌లో రెండు దేశాల మధ్య చర్చలు ఆరో రోజుకు చేరుకున్నాయి. బుధవారం కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు, ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశం కానున్నారు.
Read Also: Off The Record: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏం చేయబోతున్నారు..?
ముఖ్యంగా, భారతదేశం వస్త్రాలు, దుస్తులు, రత్నాలు మరియు ఆభరణాలు, తోలు వస్తువులు, ప్లాస్టిక్‌లు, రసాయనాలు, రొయ్యలు, నూనెగింజలు, ద్రాక్ష,అరటిపండ్లు వంటి విస్తృత శ్రేణి శ్రమ-ఆధారిత రంగాలకు సుంకం రాయితీలను ఆశిస్తోంది. అయితే, ఈ రాయితీలు అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయవని మన అధికారులు చెబుతున్నారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం, విస్తృత ద్వైపాక్షిక ఒప్పందానికి మొదటి అడుగుగా భావిస్తున్నారు. ఈ ఒప్పందం భారత్ ఎగుమతులపై 26 శాతం అధిక సుంకాలను తొలగించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతానికి వ్యవసాయంపై భారత్ ఎలాంటి రాజీ పడకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయకుండా ఉండేందుకు దృఢమైన వైఖరిని అవలంబిస్తోంది. ముఖ్యంగా, వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాల్లో సుంకాల రాయితీలను అమెరికా నుంచి ఆశిస్తోంది. ఈ రంగాల్లోకి అమెరికాను అనుమతిస్తే, భారతీయ రైతుల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
పారిశ్రామిక ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్లు, పెట్రోకెమికల్ వస్తువులు, పాడి మరియు ఆపిల్, చెట్టు గింజలు మరియు జన్యుపరంగా మార్పు చెందిన పంటలు వంటి వ్యవసాయ వస్తువులకు అమెరికా రాయితీ కోరుతున్నట్లు తెలుస్తోంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) యొక్క మొదటి దశ చర్చలను ఈ సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ముగించాలని భారతదేశం మరియు అమెరికా లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 191 బిలియన్ డాలర్లుగా ఉంది.