Infosys Narayana Murthy: బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన అభిమానులను సరిగా పట్టించుకోదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి అన్నారు. అయితే నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ఆయన సతీమణి వ్యతిరేకిస్తూ నటి కరీనాకి మద్ధతుగా మాట్లాడారు. ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ గురించి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దంపతులు మాట్లాడిన ఆసక్తికర సంభాషణ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులను కరీనా అంతగా పట్టించుకోరని నారాయణ మూర్తి వ్యాఖ్యానించగా.. ఆ మాటలను ఆయన సతీమణి సుధామూర్తి వ్యతిరేకిస్తూ నటికి మద్దతుగా నిలిచారు. ఇంతకీ వీరిద్దరూ కరీనా గురించి ఏం మాట్లాడారో తెలుసుకుందాం..
Read also: Suryapet: సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఐదుగురు కార్మికులకు గాయాలు
ఈ సంవత్సరం ప్రారంభంలో నారాయణ మూర్తి దంపతులు ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సయమంలో ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ కరీనా ప్రస్తావన తీసుకొచ్చారు. ఓసారి తాను లండన్ నుంచి వస్తుండగా విమానంలో తన పక్క సీట్లో నటి కరీనా కపూర్ కూర్చున్నారని తెలిపారు. ఆమెను చూసి చాలా మంది అక్కడకు వచ్చి నటిని పలకరించారని.. కానీ ఆమె కనీసం స్పందించలేదని.. అది చూసి తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి పలకరిస్తే లేచి నిల్చుని నిమిషమో, అర నిమిషమో మాట్లాడుతాం.. మననుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే అని నారాయణ మూర్తి అప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. పక్కనే ఉన్న ఆయన సతీమణి సుధామూర్తి ఆయన మాటలను అడ్డుకుంటూ.. ఆమెకు కోట్ల మంది అభిమానులుంటారని.. బహుశా ఆమె విసిగిపోయి ఉంటుంది… ఓ సాఫ్ట్‌వేర్ వ్యక్తి, కంపెనీ ఫౌండర్ అయిన నారాయణ మూర్తికి 10వేల మంది అభిమానులు ఉంటారేమో.. కానీ సినీ నటికి కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు కదా అని అన్నారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వులు చిందించారు. అనంతరం నారాయణ మూర్తి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ఇక్కడ సమస్య అది కాదు. ఎవరైనా మనపై అభిమానం చూపించినప్పుడు.. మనం ఆ ప్రేమను తిరిగి చూపించాలి. అది ఏ రూపంలోనైనా సరే.. తిరిగి చూపించడమే ముఖ్యమని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా eoindia అనే డిజిటల్ క్రియేటర్ సంస్థ తమ ఇన్‌స్టా పేజీలో షేర్ చేసింది.