త్రిపురలో బీజేపీ హవా కొనసాగింది. రాష్ట్రంలో 4 శాసనసభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో మూడింటిని బీజేపీ గెలుచుకోగా.. ఒక స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. బర్దోవాలి(పట్టణ) నియోజకవర్గం నుంచి పోటీచేసిన ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి మాణిక్ సాహా కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ కుమార్ సాహాపై 6,104 ఓట్ల ఆధీక్యంతో గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ గెలుపుతో ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అర్హత సాధించినట్లైంది. ఈ ఉపఎన్నికల్లో బర్దోవాలి, జుబరాజ్‌నగర్, సుర్మ స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా.. అగర్తల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మన్ 3,163 ఓట్లతో గెలుపొందారు.
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా గత నెల ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి బిప్లవ్‌దేవ్ రాజీనామాతో ఆయన సీఎం పదవిని చేపట్టారు. ఆ పదవిలో కొనసాగాలంటే చట్టప్రకారం ఎమ్మెల్యేగా గెలవడం తప్పనిసరి. నిబంధనల ప్రకారం ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. మాణిక్ గెలవడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బర్దోవాలి(పట్టణ) నియోజకవర్గ శాసన సభ్యుడు ఆశిష్ కుమార్ సాహా బీజేపీకి రాజీనామా చేసి, ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
ఈ నాలుగు నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ జూన్ 23న జరిగింది. 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దాదాపు 78 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.