Rahul Gandhi: రాహుల్ గాంధీ గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గుజరాత్‌లో పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం వస్తే 40 మంది వరకు నాయకులను తొలగించేందుకు కాంగ్రెస్ సిద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి కొందరు కాంగ్రెస్ నేతలు రహస్యం పనిచేస్తున్నారని ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది. గుజరాత్ ప్రజలతో మనం కనెక్ట్ కావాలంటే ప్రజలతో ఉండే నాయకులను, ప్రజలకు దూరంగా ఉండే నాయకులను గుర్తించాలని చెప్పారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Hizbul Mujahideen: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్.. యూపీలో దాడులకు కుట్ర..
అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తెగ ట్రోల్ చేస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ‘‘బీజేపీకి అతిపెద్ద ఆస్తి’’ అని అభివర్ణించారు. ‘‘అతను(రాహుల్ గాంధీ) తనను తాను, తన పార్టీని ట్రోల్ చేసుకుంటున్నాడు. తనను తాను అద్దంలో చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది చాలా నిజాయితీ చర్య. రాహుల్ గాంధీ గుజరాత్‌లో గెలవలేకపోతున్నానని, మార్గం చూపించలేకపోతున్నానని ఒప్పుకున్నాడు… కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వివాహాలలో నృత్యం చేయించిన రేసు గుర్రాలలా ఉన్నారని, మరికొందరు పోటీలలో పరుగెత్తడానికి తయారు చేసిన పెళ్లి గుర్రాలలా ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. మీ పార్టీ కార్యకర్తలు జంతువులా..? కనీసం పార్టీ కార్యకర్తల్ని మనుషులుగా చూడండి, మీరు గుర్రాలుగా పిలుస్తున్నారు’’ అని పూనావాలా అన్నారు.
మరోవైపు మరో అధికార ప్రతినిధి సుధాంషు త్రివేది మాట్లాడుతూ.. తన పార్టీని, ప్రజల్ని, రాజ్యాంగ సంస్థల్ని, మీడియాను నిందించడంతో మొదలుపెట్టి, ఇప్పుడు సొంత పార్టీ వారినే నిందించడం మొదలు పెట్టారని, ఇతరులను నిందించే బదులు, ఆత్మపరిశీలన చేసుకోవాలని రాహుల్ గాంధీకి సూచించారు.