Arvind Kejriwal: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన అభ్యర్థుల్ని ప్రకటించింది. బీజేపీ, ఆప్ మధ్య భారీ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, బీజేపీ తన సీఎం అభ్యర్థిగా మాజీ ఎంపీ పర్వేష్ వర్మను ప్రకటించే అవకాశం ఉందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం చెప్పారు. ‘‘సోర్సెస్ ప్రకారం.. బీజేపీ తన సీఎం అభ్యర్థిగా పర్వేష్ వర్మను ప్రకటించబోతోంది. ఢిల్లీ ప్రజలు అలాంటి వ్యక్తిని సీఎంగా చేయాలనుకుంటున్నారా..?’’ అని కేజ్రీవాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Read Also: China: మిలియన్ డ్రోన్‌లను ఆర్డర్ ఇచ్చిన చైనా.. భారత్‌కి కొత్త ముప్పు..
పర్వేష్ వర్మ గురించి మాట్లాడుతూ.. ఓటర్లకు డబ్బు పంచుతూ బీజేపీ నేత పట్టుబడ్డారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ వ్యక్తులు ప్రజల ఓట్లను కొంటున్నారని ప్రతీ చోట ప్రజలు తనకు చెప్పారరని, ఒక్క ఓటుకు రూ. 1,100 ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజలు డబ్బు తీసుకుంటారని, కానీ వారికి ఓటు వేయరని ఆప్ అధినేత పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో నన్ను తిట్టకుండా ప్రజల కోసం పనిచేసి ఉంటే, ఈ ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు.
ఢిల్లీ మాజీ ఎంపీ పర్వేష్ వర్మ తన అధికారిక నివాసంలో డబ్బులు పంచుతూ పట్టుబడ్డారని ఢిల్లీ సీఎం అతిషి కూడా ఆరోపించారు. న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ, తన ఓటర్లకు డబ్బును పంపిణీ చేస్తోందని, నియోజకవర్గంలోని వివిధ మురికివాడల మహిళలను పిలిచి కవరులో రూ.1100 ఇచ్చారని ఆమె ఆరోపించారు. పర్వేష్ వర్మ కోట్లాది రూపాయలను దాచుకున్నారని, ఈ ప్రాంగణాలపై దాడి చేసి ఈడీ అరెస్ట్ చేయాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు.