BJP New President: బీజేపీ కొత్త సంవత్సరంలో తమ నూతన సారథిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరికి ఆ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని కమలం పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల పదవీకాలం ఇప్పటికే పూర్తైన నేపథ్యంలో .. వచ్చే నెలలో వారిని మార్చనున్నట్లు టాక్. పార్టీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది.
Read Also: One Nation One Election: జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు పంపడంపై లోక్‌సభలో ఓటింగ్..
కాగా, ఫిబ్రవరి చివరికి కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. కేంద్రమంత్రులుగా పని చేస్తున్న వారిలోనే ఒకరికి బీజేపీ జాతీయాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తారా? లేక కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ నడ్డా 2020లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే, మూడోసారి కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. మామూలుగా పార్టీ చీఫ్ పదవీకాలం మూడేళ్లు.. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నడ్డా పదవీకాలాన్ని కమలం పార్టీ పొడిగించారు.