ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటింది భారతీయ జనతా పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం తొందరపడటం లేదు. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. గోవాలో ఒక్క సీటు తక్కువైనా.. మద్దతు ఇచ్చేందుకు స్వతంత్రులు, ఎంజీపీ రెడీగా ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి సమస్యలు లేకపోయినా.. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు మాత్రం.. చాలా కసరత్తే చేస్తున్నారు. గతంలో కేంద్ర కేబినెట్ కోసం ఎంత వర్కవుట్ చేశారో.. ఇప్పుడు అదే స్థాయిలో లెక్కలు వేసుకుంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని.. యూపీలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం ఉండేలా మంత్రుల్ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం మోడీతో యోగి ఆధిత్యనాధ్ భేటీతో మొదలైన కసరత్తు.. సోమవారం 4 గంటలపాటు, మంగళవారం 3 గంటలపాటు కొనసాగింది. అమిత్‌షా, నడ్డా, బీఎల్ సంతోష్.. నిన్న మోడీ నివాసంలో భేటీయై యూపీ కేబినెట్ పై చర్చలు జరిపారు. ఇవాళ యోగితో కలిసి కేబినెట్ కూర్పును ఒక కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది.
Read Also: Virat Kohli: రన్ మెషిన్‌కు ఏమైంది..?
ఇక, యూపీలో కేబినెట్ కూర్పుపై చర్చలు జరగుతుండగా.. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఎవరిని సీఎంలను చేస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. గోవాలో సావంత్‌కు లైన్ క్లియర్‌గా ఉన్నప్పటికీ.. బీజేపీ పెద్దల మనసులో ఏముందో చివరివరకు చెప్పడం కష్టమంటున్నారు. ఇక మణిపూర్‌లో తొలిసారి పూర్తి మెజార్టీ సాధించిన బీజేపీ.. మళ్లీ బీరెన్ సింగ్‌నే ముఖ్యమంత్రిగా చేస్తుందో, లేదో చూడాలి. ఇక ఉత్తరాఖండ్‌లో సీఎం ఓటమిపాలు కావడంతో.. అక్కడ ముఖ్యమంత్రి రేసులో ఆరుగురి వరకు పోటీలో ఉన్నారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాలకు పరిశీలకుల్ని నియమించిన బీజేపీ.. ఢిల్లీలో కసరత్తు కొనసాగిస్తోంది. సీఎంలు, మంత్రుల లిస్ట్ ప్రిపరేషన్స్ పూర్తికాగానే.. పరిశీలకులతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేయనున్నారు బీజేపీ పెద్దలు.