Coffee With Youth: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి మోడీ నేతృత్వంలో అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఎన్డీయే కూటమి ఈ సారి 543 ఎంపీ స్థానాల్లో 400కి పైగా గెలుచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. బీజేపీ స్వతహాగా 370 స్థానాలు సాధించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేస్తోంది.
తాజాగా మహారాష్ట్ర బీజేపీ యూనిట్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ‘కాఫీ విత్ యూత్’ పేరుతో ప్రచారం ప్రారంభించింది. ప్రధాని నరేంద్రమోడీ ఫోటోతో కూడిని కాఫీ మగ్‌లను ప్రచారంలో ఉపయోగించనున్నారు. బీజేపీ యువమోర్చా మహారాష్ట్ర(BJYM), ముఖ్యంగా యువతతో ఇంటరాక్ట్ కావడానికి ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. యువతకు చేరువ కావడానికి కాఫీ, చాయ్ మాధ్యమంగా ఉపయోగపడుతాయని, వారిని కలుసుకునేందుకు ఇదే ఉత్తమమైన మార్గమని మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విక్రాంత్ పాటిల్ అన్నారు.
Read Also: Baltimore Bridge Collapse: బాల్టిమోర్ ఘటనలో ఇండియన్ సిబ్బందిని అవమానించేలా రేసిస్ట్ కార్టూన్..
గ్రామీణ ప్రాంతాల్లో యువకులను లక్ష్యంగా చేసుకుని ‘నమో యువ చౌపాల్’ ప్రచారాన్ని కూడా బీజేపీ ప్రారంభించింది. రెండు ప్రచారాల ద్వారా పార్టీ కార్యక్రమాలను యువతకు మరింత చేరువ అవ్వాలని భావిస్తోంది. యువతతో చర్చించేందుకు 300 మంది వక్తల జాబితాను పార్టీ సిద్ధం చేసినట్లు విక్రాంత్ పాటిల్ చెప్పారు. తొలిసారి ఓటర్లు, యువతతో సంభాషన, చర్చలు జరపడానికి ‘కాఫీ విత్ యూత్’ కార్యక్రమం ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. నరేంద్రమోడీ ప్రభుత్వం చేసిన కృషిని ఈ కార్యక్రమాల ద్వారా వివరించనున్నారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి.