BJP Comments On Rahul Gandhi’s T-shirt: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ గత వైభవాన్ని సంతరించుకోవాలని చూస్తోంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపుగా 3570 కిలోమీటర్ల మేర ఐదు నెలల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ యాత్రను చేపట్టింది. కన్యాకుమారి నుంచి ఈ నెల 7 నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర కాశ్మీర్ లో ముగియనుంది. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. రాహుల్ గాంధీ ధరించిన టీషర్టుపై బీజేపీ విమర్శలు చేస్తోంది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ధరించిన టీషర్టు ధర రూ. 41,000 కన్నా ఎక్కువ అని బీజేపీ విమర్శలు చేస్తోంది. భారతదేశమా చూడండి అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తోంది. ‘‘ భారత్, దేఖో’’ అంటూ రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, అతను ధరించిన టీషర్టు ఫోటోలను జతచేసి ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీ ధరించిన టీషర్టు ధర రూ. 41,257 అని బీజేపీ పేర్కొంది.
Read Also: V Hanumantha Rao: సీనియర్లను పట్టించుకోవట్లేదు.. స్రవంతికి టికెట్ ఇవ్వడంపై వీహెచ్ స్పందన
బీజేపీ ట్వీట్ కు కాంగ్రెస్ కూడా అంతే స్థాయిలో బదులు ఇస్తోంది. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న జనాలను చూసి మీరు భయపడుతున్నారా..? నిరుద్యోగం, ద్రవ్యోల్భనం గురించి మాట్లాడండి అంటూ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. బట్టల గురించి మాట్లాడితే ముందుగా ప్రధాన మంత్రి రూ.10 లక్షల సూట్ గురించి చర్చించాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.
అంతకు ముందు రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రను తాను నాయకత్వం వహించడం లేదని.. కేవలం పాల్గొంటున్నానని.. విద్వేషాన్ని వ్యాప్తి చేసిన బీజేపీ-ఆర్ఎస్ఎస్ చేసిన నష్టాన్ని పూడ్చేందుకే యాత్రను ప్రారంభించామని ఆయన అన్నారు. ప్రజల్లో ఐక్యత నెలకొల్పడంతో పాటు ప్రజలతో మమేకం అవ్వడం వారి సమస్యలు వినడం, బీజేపీ పాలనను వారికి తెలియజేయడం ఈ యాత్ర ఆలోచన అని రాహుల్ గాంధీ అన్నారు.
Bharat, dekho! pic.twitter.com/UzBy6LL1pH
— BJP (@BJP4India) September 9, 2022