West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని అక్రమ బాణసంచా తయారీ కర్మాగారంలో మంగళవారం జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి కర్మాగారం పూర్తిగా ధ్వంసం అయింది. పేలుడు జరిగిన స్థలంలో చెల్లచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. పూర్బా మేదినీపూర్ లోని ఏగ్రాలో ఈ ఘటన జరిగింది. ఈ పేలుడు స్థానికుల్లో ఆగ్రహాన్ని పెంచింది. పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఘటన జరిగిన ప్రాంతం ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ పేలుడు సంభవించిన వెంటనే దాని యజమాని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Nitin Gadkari: నితిన్ గడ్కరీకి మరోసారి బెదిరింపు కాల్..
ఇదిలా ఉంటే ఈ పేలుడు ఘటన రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), విపక్ష టీఎంసీ మధ్య మాటల యుద్ధాన్ని ప్రేరేపించింది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు ముందు తృణమూల్ బాంబులు తయారుచేస్తోందని, పేలుడుపై ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ బాంబుల తయారీ చేస్తున్న కర్మాగారం టీఎంసీ నాయకుడిదని, పంచాయతీ ఎన్నికల ముందు శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుంబర్ అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిషాను కోరారు.
బీజేపీ చేస్తున్న విమర్శలపై సీఎం మమతాబెనర్జీ విమర్శలు గుప్పించారు. అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్న వ్యక్తిపై పోలీసులు ఇంతకుముందు కేసులు పెట్టి జైలుకు పంపారని, బెయిల్ పై విడుదలై మళ్లీ ప్రారంభించాడని ఆమె అన్నారు. ఈ కేసును సీఐడీ విచారిస్తోందని తెలిపింది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య లేదని ఆమె వెల్లడించారు. ఘటన జరిగిన పంచాయతీ ప్రాంతం బీజేపీ ఆధీనంలో ఉందని, దీంట్లో తృణమూల్ కు ఎలాంటి సంబంధం లేదని ఆమె అన్నారు. ఇలాంటి ఘటన జరిగిన సమయంలో రాజకీయాలు చేస్తారా..? అంటూ దీదీ మండిపడ్డారు.