PM Narendra Modi: ప్రధానమంత్రి 72వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు మోడీని ప్రశంసిస్తూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ ఇవాళ పలు కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు. తన 72వ జన్మదినం సందర్భంగా నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేయనున్నారు. దీనితో పాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
“ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టిన రోజు సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. సాటిలేని కఠోర శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో మీరు చేపడుతున్న దేశ నిర్మాణ సంగ్రామం కొనసాగాలనీ.. మీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ప్రసాదించాలి.” -ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి
72వ పుట్టిన రోజు సందర్భంగా భారత ప్రధాని మోడీకి శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో కలకాలం జీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. -దలైలామా
“ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేశంలో సుపరిపాలన అందించేందుకు మోదీ ఎంతో కృషి చేశారు. ఆయన నాయకత్వంలో దేశం సరికొత్త శిఖరాలకు చేరుకుంది.” – కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
“దేశ అభిమాన నాయకుడు, మనందరికీ స్ఫూర్తి అయిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల మోదీ.. పేదల సంక్షేమానికి కృత నిశ్చయంతో ఉన్నారు” – కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
భారత ప్రధాని నరేంద్రమోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
“ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మా సైద్ధాంతిక, రాజకీయ పోరాటం కొనసాగిస్తాం. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యక్తిగత విద్వేషం, కక్ష సాధింపు చర్యలు మరింత తీవ్రమయ్యాయి. అయినప్పటికీ మన ప్రధాని నరేంద్ర మోడీ 72వ జన్మదిన సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.” –జైరాం రమేష్, కాంగ్రెస్ సీనియర్ నేత
“తెలంగాణ ప్రజల తరపున, నా తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో మరింత కాలం జాతికి సేవ చేయాలి.” -తెలంగాణ సీఎం కేసీఆర్ .
“అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులతో మంచి ఆరోగ్యం, దీర్ఘాయిష్షు ఉండాలి.” -ఏపీ సీఎం జగన్.
“ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని.. దేశ ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి.” -చంద్రబాబు