Bihar Elections: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ పోలింగ్ గురువారం జరుగుతోంది. అయితే, రాష్ట్రంలోని లఖిసరై జిల్లాలో పోలింగ్ రోజున ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో, ఆవు పేడతో, చెప్పులతో దాడులు చేశారు. లఖిసరై నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే అయిన సిన్హా, ఖోరియారి గ్రామాన్ని సందర్శించకుండా అడ్డుకునేందుకు ఆర్జేడీ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్లు బీజేపీ ఆరోపించింది. అనేక మంది సిన్హా కారును అడ్డుకుని ‘‘ముర్దాబాద్’’ అంటూ నినాదాలు చేశారు. గ్రామంలోకి ప్రవేశించకుడా ఆపేశారు.
Read Also: Singer Maithili Thakur: ఆర్జేడీ కంచుకోటలో మైథిలి ఠాకూర్ రాణించగలరా?
‘‘వీరంతా ఆర్జేడీ గుండాలు, ఎన్డీయే అధికారంలోకి వస్తుందని వారికి తెలుసు. అందుకే వారు గుండాయిజానికి పాల్పడుతున్నారు. వారు నా పోలింగ్ ఏజెంట్‌ను తిప్పిపంపారు. అతడిని ఓటు వేయనీయలేదు. జిల్లా పోలీసులు పిరికివారు. కేంద్ర బలగాలను మోహరించాలి.’’ అని సిన్హా అన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత, వారి ఛాతీలపై మేము బుల్డోజర్లు ఎక్కిస్తామని హెచ్చరించారు. కొన్ని బూతుల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగిందని డిప్యూటీసీఎం ఆరోపించారు.