Waqf board: బీహార్ బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ డాక్టర్ సంజయ్ జైశ్వాల్ వక్ఫ్ బోర్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ రాష్ట్ర సున్నీ వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణలో పారదర్శకత లోపించిందని ఆరోపించిందని, సరైన డాక్యుమెంటేషన్ లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పాట్నాలోని ఫతుహా ప్రాంతంలో వక్ఫ్ బోర్డు కార్యకలాపాల కారణంగా పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో జైశ్వాల్ నుంచి ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రాంతంలోని ప్రజలు తమ పూర్వీకుల నుంచి తమకు సంక్రమించిన భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించి స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్నారని పేర్కొన్నారు.
గురువారం వివాదస్పద వక్ఫ్ సవరణ బిల్లు -2024ను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి), సమస్యను పరిష్కరించడానికి బీహార్‌ను సందర్శించింది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలో కూడిన ఈ కమిటీ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తమ నివేదికను సమర్పించాలని భావిస్తోంది. ఇటీవల కాలంలో ఫతుహాలో వక్ఫ్ బోర్డు భూ ఆక్రమణలకు పాల్పడిందనే ఆరోపణలు వైరల్‌గా మారాయి. స్థానిక అధికారులు రంగంలోకి దిగి నివాసితులకు తాత్కాలిక ఉపశమనం కల్పించారు. వక్ఫ్ బోర్డు, భూమాఫియా కుమక్కయ్యారనే ఆరోపణలు స్థానిక నివాసితుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఉర్దూ పత్రాలకు హిందీ అనువాదాలు అందించమని అడిగినప్పుడు వక్ఫ్ బోర్డు సహకరించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
బీజేపీ ఎంపీ ఫతుహాలోని గోవింద్ పూర్ గ్రామాన్ని సందర్శించారు. చాలా కాలంగా ఇక్కడి నివాసితులకు వక్ఫ్ బోర్డు నోటీసులు అందుతున్నాయని, వారు ఈ భూమి నుంచి స్థానికుల్ని వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారని ఎంపీ జైశ్వాల్ చెప్పారు. ఈ సమస్యలో ఎక్స్ వార్డ్ కౌన్సిలర్ ఎండీ బబ్లూ తలదూర్చారని, పదేళ్లుగా ఈ కేసులో కేసులో కీలకంగా వ్యవహరిస్తున్నాడని, వక్ఫ్ బోర్డు చేసిన క్లెయిమ్ కారణంగా రోడ్ల నిర్మాణంతో సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ఆగిపోయినట్లు ఎంపీ వెల్లడించారు. వక్ఫ్ బోర్డు సరైన సాక్ష్యాలు సమర్పించకపోవడంతో ఇక్కడి ప్రజలకి పాట్నా హైకోర్టు ఉపశమనం కలిగించింది. నివాసితులు తుది తీర్మానం కోసం ఎదురుచూస్తు్న్నారు. అయితే, ఇక్కడి వివాదాస్పద స్థలంలో బబ్లూ ఖాన్ ఇంటిని నిర్మించుకున్నప్పటికీ, అతడికి నోటీసులు వెళ్లలేదని ఎంపీ పేర్కొన్నారు.