ఐటీ నగరం బెంగళూరు రహదారులు గుంతల మయంగా మారాయి. ఏ రోడ్డు చూసినా భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఉద్యోగాలకు వెళ్లే ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా నానా యాతన పడుతున్నారు. అయితే శనివారం ఉద్యోగులంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. బెంగళూరు రోడ్లు బాగు చేయాలని నివాసితులు నిరసనలు తెలిపారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి నిరసనకారులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

బెంగళూరు వాసులు ‘‘బెంగళూరు రోడ్లను కాపాడండి’’, ‘‘రోడ్లను సరిచేయండి’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. శనివారం ఉదయం రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు ప్రత్యక్షమై అనుమతి లేకుండా ఎలా నిరసనలు తెలుపుతారని అడ్డుకున్నారు. వెంటనే ఆపకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో నిరసనకారులు-పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బెంగళూరు రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని.. బాగు చేయమని అడిగితే పోలీసులు అడ్డుకోవడమేంటి? అని నిరసనకారులు ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Pakistan: భారత్‌తో యుద్ధం జరిగితే సౌదీ కూడా వస్తుంది.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
బెంగళూరులోని గూగుల్ కార్యాలయం వెలుపల రోడ్డు, ఫుట్‌పాత్ ధ్వంసమైపోయింది. భారీ గుంతలు ఏర్పాడ్డాయి. దీంతో నడిచి వెళ్లడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు వేయకపోయినా కనీసం తాత్కాలికంగా పూడ్చాలని కోరుతున్నారు. ఇటీవల రోడ్డుపై వెళ్తున్న స్కూల్ బస్సు గుంతలో పడి బోల్తాపడింది. అనంతరం స్థానికులు సురక్షితంగా పిల్లల్ని రక్షించారు.
ఇది కూడా చదవండి: Amit Shah: దశాబ్ద కాలంలో మోడీ చేసినంత అభివృద్ధి ఏ ప్రధానైనా చేశారా? జీఎస్టీని ప్రశంసించిన అమిత్ షా
అయితే ఈ గుంతలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. చేతకాని ప్రభుత్వం అంటూ దుమ్మెత్తిపోస్తోంది. అయితే బీజేపీ ఆరోపణలను డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ తిప్పికొట్టారు. ప్రకృతి విపత్తుల వల్ల గుంతలు ఏర్పడ్డాయని.. భారీ వర్షాలు కారణంగా సహజంగానే గుంతలు ఏర్పడతాయని చెప్పుకొచ్చారు. బీజేపీ అనవసరంగా రాజకీయాలు చేస్తోందని పేర్కొన్నారు. ఎవరూ కావాలని గుంతలు సృష్టించాలని అనుకోరని… వాహనాల పెరుగుదల, భారీ ట్రాఫిక్, బెంగళూరులో అధిక వర్షం కారణంగా గుంతలు ఏర్పడ్డాయని వివరించారు. ఇప్పటికే 7,000 కంటే ఎక్కువ గుంతలను పూడ్చామని. 5,000 కంటే ఎక్కువ గుంతలు మిగిలి ఉన్నాయని తెలిపారు. గుంతల పరిస్థితిపై నివేదిక సమర్పించాలని పోలీసు కమిషనర్‌ను కోరినట్లు వెల్లడించారు.