కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ అధిష్టానానికి తలనొప్పులు తప్పడం లేదు. అయితే గతంలో బీజేపీ అధిష్టానం ఆ రాష్ర్ట ప్రస్తుత సీఎంను తప్పిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ దీనిపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు.
చికిత్స కోసం విదేశాలకు వెళ్లడం లేదని ఆయన చెప్పారు. దావోస్‌లో జరగబోయే ప్రోగ్రాం కూడా జూన్‌కు వాయిదా పడిందని వెల్లడించారు. ఇప్పట్లో తాను ఎలాంటి విదేశీ పర్యటనకు వెళ్లడం లేదని బొమ్మై స్పష్టం చేశారు. కాగా గత కొంత కాలంగా బీజేపీ అధిష్టానం బొమ్మైని తప్పిస్తారని ప్రచారం జోరుగా సాగుతుంది. స్వయంగా ఈ వార్తలకు బొమ్మై చెక్ పెట్టడంతో కర్ణాటక రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి.