UP: ఉత్తర్ ప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇఫ్తికార్ ఖాన్ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఖాన్ గురించి నిర్దిష్ట సమాచారం తెలిసిన తర్వాత పోలీసులు తెల్లవారుజామున 5.30-6.00 గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. కాస్‌గంజ్ కు చెందిన ఇఫ్తికార్ ఖాన్ పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించబడ్డాడు. ఇతడిపై రూ. లక్ష రివార్డు ఉంది.
Read Also: Bihar Elections: పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు.. ఏఐ వీడియోలు ఉపయోగించొద్దని వార్నింగ్
బరేలీ ఎస్ఎస్పీ అనురాగ్ ఆర్య ప్రకారం, ఇఫ్తికార్ ఖాన్‌ను పట్టుకునే సమయంలో పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడని, ఆ తర్వాత జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అతను అక్కడ మరణించినట్లు వైద్యులు ప్రకటించినట్లు ఆర్య చెప్పారు. ఎన్‌కౌంటర్ సమయంలో ఒక పోలీస్ అధికారి గాయపడ్డాడు. పోలీసులు సంఘటన స్థలం నుంచి ఒక పిస్టల్, 17 లైవ్ కార్ట్రిడ్జ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
షైతాన్, సోల్జర్ అనే మారుపేర్లు కలిగిన ఇఫ్తికార్ ఖాన్‌పై దోపిడీ, హత్యలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయి. అనేక పోలీస్ స్టేషన్లలో ఇతడిపై కేసులు నమోదయ్యాయి. 19 క్రిమినల్ కేసులు ఇతడిపై ఉన్నాయి. బిత్రీ చైన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన వరస దోపిడీలు, హింసాత్మక నేరాల్లో ఇతడి ప్రత్యక్ష ప్రమేయం ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఖాన్ సన్నిహితుతు తప్పించుకున్నాడు. పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.