Bangladesh: షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆడింది ఆటగా సాగుతోంది. బంగ్లాదేశ్ తీవ్ర భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంది. భారత శత్రువులకు ‘‘రెడ్ కార్పెట్’’ ఆహ్వానం పలుకుతోంది. తాజాగా, ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ (LeT) హఫీజ్ సయీద్ సన్నిహితులు బంగ్లాదేశ్‌కు వెళ్లాడు. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ మర్కజీ జమియత్ అహ్ల్-ఎ-హదీత్ ప్రధాన కార్యదర్శి ఇబ్తిసం ఎలాహి జహీర్ అక్టోబర్ 25న ఢాకా చేరుకున్నారు. ఇతను భారత సరిహద్దు ప్రాంతంలో పర్యటించినట్లు సమాచారం.
గత రెండు రోజల్లో జహీర్ రాజ్‌షాహీ, చపైనావాబ్‌గంజ్ వంటి సరిహద్దు ప్రాంతాలను సందర్శించాడు. దీంతో పాటు భారత్ సరిహద్దుల్లోని రంగ్‌పూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ పాలకుడు అయిన తర్వాత జహీర్ రెండోసారి ఆ దేశంలో పర్యటిస్తున్నాడు. అంతకుముందు ఫిబ్రవరిలో జహీర్ బంగ్లా వెళ్లాడు. లష్కరే తోయిబా బంగ్లాదేశ్‌లో తన కార్యకలాపాలను మొదలుపెట్టాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. యూనస్ పదవీ లోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులైన జమాతే ఇస్లామీ, బీఎన్పీ వంటి సంస్థలు యాక్టివ్ అయ్యాయి.
Read Also: Pulluri Prasad Rao : మావోయిస్టులకు మరో దెబ్బ.. డీజీపీ ముందు లొంగిపోనున్న కీలక నేతలు
ఇదిలా ఉంటే, ఈ వారం ప్రారంభంలో పాకిస్తాన్ ఆర్మీ టాప్ జనరల్స్‌లో ఒకరైన, పాక్ ఆర్మీ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్‌పర్సన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా కూడా బంగ్లాదేశ్ వెళ్లాడు. ఏకంగా మహ్మద్ యూనస్‌తో భేటీ అయ్యాడు. ఆ సమయం యూనస్ మీర్జాకు ఒక పుస్తకాన్ని బహూకరించాడు. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పుస్తకంపై బంగ్లాదేశ్ మ్యాప్‌లో భారత ఈశాన్య రాష్ట్రాలను కూడా చేర్చినట్లు కనిపిస్తోంది.
మరోవైపు, భారత్ మోస్ట్ వాంటెంట్ జకీర్ నాయక్‌ను కూడా బంగ్లాదేశ్ స్వాగతిస్తోంది. విద్వేష ప్రసంగాలు, తీవ్రవాద భావజాలాన్ని పెంచి పోషించిన కేసుల్లో ఇతడిని భారతదేశం కోరుతోంది. ప్రస్తుతం, ఇతను మలేషియాలో ఆశ్రయం పొందుతున్నాడు. గతంలో పాకిస్తాన్ పర్యటనకు కూడా ఇతను వెళ్లి వచ్చాడు. 2016లో ఢాకా హోలీ ఆర్టిసన్ బేకరీ ఉగ్రవాద దాడి తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా, నాయక్ నిర్వహిస్తున్న పీస్ టీవీపై నిషేధం విధించింది. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది నయీక్ ప్రసంగాలతో ప్రేరణ పొందినట్లు చెప్పారు.
ప్రస్తుతం, భారత వ్యతిరేకులు అంతా బంగ్లాదేశ్‌లో ఏదో కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఐఎస్ఐ, బంగ్లా ఉగ్రవాద సంస్థలు యాక్టివ్ అయ్యాయి. ఐఎస్ఐ బంగ్లాదేశ్‌లో హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ, జామాత్ ఉల్ ముజాహిద్ బంగ్లాదేశ్ వంటి ఉగ్ర సంస్థలకు శిక్షణ ఇస్తోంది. జకీర్ నాయక్ పర్యటన ఈ గ్రూపులకు మద్దతు ఇస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.