India-Bangladesh: బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఢాకాలోని భారత హైకమిషన్‌కు భద్రతా బెదిరింపులు చేశారు. అయితే, ఈ పరిణామాలపై భారత్ బంగ్లాదేశ్ హైకమిషన్ ఎం రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత మిషన్‌పై దాడులు చేస్తామంటూ అక్కడ కొంతమంది తీవ్రవాద శక్తులు వ్యాఖ్యానించడంపై భారత విదేశాంగశాఖ సమన్లు జారీ చేసినట్లు తెలిపింది. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ సంఘటనలకు సంబంధించి సరైన ఆధారాలు పంచుకోకపోవడం, చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని చెప్పింది.
యాదృచ్ఛికంగా, బంగ్లాదేశ్ నాయకుడు ఈశాన్య రాష్ట్రాలను ప్రస్తావిస్తూ.. సెవన్ సిస్టర్స్‌ను ఒంటరి చేస్తామని బెదిరించిన ఒక రోజు తర్వాత హైకమిషనర్ ఎం రియాజ్ హమీదుల్లాను భారత విదేశాంగశాఖ పిలిపించింది. గతేడాది షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకతను కొన్ని మతఛాందస సంస్థలు పెంచి పోషిస్తున్నాయి. భారత్‌ను బెదిరించేలా అక్కడి నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు.
Read Also: Imran Khan: “మా తండ్రిని ఇక చూడలేమేమో”.. ఇమ్రాన్ ఖాన్ కుమారుల సంచలన వ్యాఖ్యలు..
‘‘బంగ్లాదేశ్‌ను అస్థిరపరిస్తే, ప్రతిఘటన అగ్ని సరిహద్దులు దాటి వ్యాపిస్తుంది. మీరు మమ్మల్ని అస్థిరపరిచే వారికి ఆశ్రయం ఇస్తున్నందున, మేము సెవెన్ సిస్టర్స్ వేర్పాటువాదులకు కూడా ఆశ్రయం ఇస్తాము’’అని సోమవారం ఒక ర్యాలీలో భారతదేశం యొక్క తీవ్ర విమర్శకుడైన నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) నాయకుడు హస్నత్ అబ్దుల్లా హెచ్చరించారు.
ఇదిలా ఉంటే, భారత వ్యతిరేకి, షేక్ హసీనాను గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాదిపై ఢాకాలో హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో భారత్, అవామీలీగ్ పాత్ర ఉందని అక్కడి భారత వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తర్వాత బంగ్లాదేశ్ ఢాకాలోని భారత హైకమిషనర్‌ను పిలిపించింది. ఈ హత్యాయత్నం కేసులో సహకరించాలని చెబుతూనే, హసీనాను అప్పగించాలని డిమాండ్ చేసింది. అయితే, ఈ దాడిలో భారత ప్రమేయంపై వస్తున్న ఆరోపణల్ని భారతదేశం తీవ్రంగా తిరస్కరించింది.