పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులపై నేటి నుంచి దేశవ్యాప్తంగా నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నిషేధాన్ని ఏకకాలంలో కాకుండా దశలవారీగా అమలు చేయాలని కంపెనీలు, వాణిజ్య సంస్థలు కోరినా.. కేంద్రం వెనక్కి తగ్గలేదు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి నేరుగా చర్యలు తీసుకోవడానికి బదులు తొలుత ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే సంస్థలు, పంపిణీ, నిల్వ, అలాంటి వస్తువుల అమ్మకాలు జరిపే వాటిపై ప్రచారం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.ఈ సందర్భంగా దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి రూ.లక్ష వరకు జరిమానా లేదా ఐదేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం వెల్లడించారు.
DRDO: మానవరహిత యుద్ధ విమానాన్ని తొలిసారి పరీక్షించిన డీఆర్డీవో
గతేడాది ఆగస్టులోనే కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల శాఖ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సవరణ రూల్ 2021ను నోటిఫై చేసింది. ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రూల్ ప్రకారం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, విక్రయం నిషేధం. ఈ నిబంధన ప్రకారం ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, క్యాండీలకు వాడే ప్లాస్టిక్ పుల్లలు ఇలా మొత్తం 19 రకాల వస్తువులపై నిషేధం విధించారు.
ఈ నిబంధనను అతిక్రమించిన వారు శిక్షార్హులని కేంద్రం వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్షను విధించవచ్చు. అంతేకాకుండా రూ.లక్ష వరకు జరిమానా కూడా విధించవచ్చు.