Bald Within A Week: మహారాష్ట్రలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. బుల్దానా జిల్లాలోని మూడు గ్రామాల్లోని ప్రజలకు హఠాత్తుగా జట్టు రాలుతోంది. గత కొన్ని రోజులుగా ఈ గ్రామాల్లోని ప్రజలకు విపరీతంగా జట్టు రాలుతోంది. వారం రోజుల్లోనే బట్టతల వచ్చింది. అయితే, సామూహికంగా ప్రజలకు ఒకేసారి జట్టు రాలిపోవడంపై అక్కడి ప్రజల్లో భయం నెలకొంది. అయితే, ఇలా జుట్టు రాలిపోవడానికి ఎరువుల వల్ల నీటి కాలుష్యమే కారణమని ఆరోగ్య శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలోని నీటి శాంపిల్స్, గ్రామస్తుల నుంచి జట్టు, చర్మ నమూనాలను పరీక్షల కోసం తీసుకెళ్లారు.
బోర్గావ్, కల్వాడ్, హింగ్నా గ్రామాలు బుల్దానా జిల్లాలోని షెగావ్ తహసీల్‌లో ఉన్నాయి. కొన్ని రోజులుగా పురుషులు, స్త్రీలకు జట్టు విపరీతంగా రాలుతోంది. ఒక వ్యక్తికి కేవలం వారం రోజుల్లోనే బట్టతల వచ్చింది. ఈ గ్రామాల్లో ఆరోగ్య శాఖ పర్యటించింది. సుమారు 50 మంది వరకు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గ్రామాన్ని సందర్శించిన ఆరోగ్య బృందంలో షెగావ్ ఆరోగ్య అధికారి డాక్టర్ దీపాలి రహేకర్ మాట్లాడుతూ.. ఇది కలుషితమై నీటి వల్ల కావచ్చని, మేము శాంపిళ్లను కలెక్ట్ చేసి, పరీక్షలకు పంపామని చెప్పారు.