Yogi Adityanath: మొఘల్ పాలకుడు ఔరంగజేబు, అతని వారసులను ఉద్దేశించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. యూపీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఔరంగజేబు వారసులు ఇప్పుడు కలకత్తా సమీపంలో నివసిస్తున్నారని, జీవించడానికి రిక్షాలు నడుపుకుంటూ బతుకుతున్నారని అన్నారు. ‘‘ఇది చరిత్ర యొక్క దైవిక న్యాయం’’గా అభివర్ణించారు. ఔరంగజేబు దైవత్వాన్ని ధిక్కరించి, దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలపై విధ్వంసక చర్యలకు పాల్పడ్డాడని చెప్పారు.
Read Also: KTR Case: హైకోర్టులో కేటీఆర్ కేసు విచారణ.. ఏసీబీ కేసుపై లంచ్‌మోషన్ పిటిషన్
బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై యోగి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సనాతన విలువల్ని కాపాడాలని సమాజాన్ని కోరారు. ‘‘మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ‘వసుధైవ కుటుంబం’ (ప్రపంచం ఒకే కుటుంబం) అనే భావనను ఊహించారు. సంక్షోభ సమయంలో అన్ని వర్గాల, విశ్వాసాలకు ఆశ్రయం కల్పించిన ఏకైక మతం సనాతన ధర్మం. కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ హిందువులకు ఎలాంటి పరిస్థితులు వచ్చాయి.’’ అని అయోధ్యలోని అసర్ఫీ భవన్ పీఠ్‌లో జరిగిన సభలో అన్నారు.
కాశీ విశ్వనాథ్ ధామ్, అయోధ్య, సంభాల్, భోజ్‌పూర్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను ప్రస్తావిస్తూ, హిందూ దేవాలయాల చారిత్రక విధ్వంసాన్ని ఆదిత్యనాథ్ హైలైట్ చేశారు. శతాబ్ధాలుగా హిందూ ఆలయాలు పదేపదే దాడులకు గురువుతున్నాయని అన్నారు. 17వ శతాబ్ధంలో భారత్‌ని పాలించిన ఔరంగజేబు భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన మతోన్మాదిగా పేరొందారు. ముఖ్యంగా హిందువుల దేవాలయాలపై దాడులు, హిందువుల అణిచివేతకు ప్రతీకగా నిలిచారు.