Himanta Biswa Sarma: అస్సాం రాష్ట్రంలో పెరుగుతున్న ముస్లిం జనాభాపై సీఎం హిమంత బిశ్వ సర్మ ఆందోళన వ్యక్తం చేశారు. 2041 నాటికి రాష్ట్రం ముస్లిం మెజారిటీగా మారుతుందని, ఇది పచ్చినిజమని శుక్రవారం చెప్పారు. రాష్ట్రంలో ముస్లిం జనాభా ప్రతీ పదేళ్లకు 30 శాతం పెరుగుతోందని, 2041 నాటికి వారే మెజారిటీ అవుతారని చెప్పారు. గౌహతిలో జరిగిన విలేకరులు సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అస్సాం జనాభాలో ముస్లింలు 40 శాతంగా ఉన్నారని అన్నారు. దీనిని ఎవరూ ఆపలేరని చెప్పారు. బుధవారం రోజు కూడా ఆయన రాష్ట్రంలో ముస్లిం జనాభా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ముస్లిం జనాభా విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ముస్లిం జనాభా అనేది రాజకీయ విషయం కాదని, ఇది ‘జీవన్మరణ’ సమస్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనాభా వైవిధ్యం మారడం నాకు పెద్ద సమస్య అని అన్నారు. 1951లో 12 శాతం ఉన్న ముస్లింలు ఇప్పుడు 40 శాతానికి చేరుకున్నారని, దీని వల్ల తాము చాలా జిల్లాలను కోల్పోయామని చెప్పారు.
Read Also: Odisha: వైద్యం పేరుతో మహిళ తలలో 18 సూదులు గుచ్చిన తాంత్రికుడు..
హిమంత బిశ్వ సర్మ పలు సందర్భాల్లో రాష్ట్రంలోని ముస్లిం జనాభా పెరుగుదల గురించి మాట్లాడారు. జూన్ 2021లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఆయన మాట్లాడుతూ, అస్సాంలో మైనారిటీ ముస్లింలలో ఆర్థిక అసమానతలు, పేదరికానికి జనాభా విస్ఫోటనం కారణమని అన్నారు. రాష్ట్రంలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో జనాభా నియంత్రణపై అవగాహన కల్పించేందుకు గర్భనిరోధక సాధనాలు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత సంవత్సరం, అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని ఐదు స్థానిక ముస్లిం వర్గాల సామాజిక-ఆర్థిక సర్వేను నిర్వహిస్తుందని, తద్వారా వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అస్సాంని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు కొనసాగుతున్నాయని వాటిపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన తరువాత,బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్ ముస్లింలను ‘మియా’ అని పిలుస్తారు, వారిని స్థానిక ప్రజలుగా గుర్తించడానికి షరతులు విధిస్తామని సీఎం హిమంత చెప్పారు. అస్సాంలో మియా కమ్యూనిటీకి గుర్తింపు రావాలంటే ఆ సమాజంలోని ప్రజలు కొన్ని సాంస్కృతిక పద్ధతులు , నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హిమంత శర్మ నొక్కి చెప్పారు. మియా కమ్యూనిటీలను స్థానికులుగా గుర్తించేందుకు కుటుంబ పరిమాణాన్ని ఇద్దరు పిల్లలకు పరిమితం చేయడం, బహుభార్యత్వాన్ని నిలిపేయడం, బాల్య వివాహాలను నిషేధించడం వంటి చర్యలను ఆయన హైలెట్ చేశారు.